
- కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే
- చర్యలు ఉంటాయని ప్రభుత్వం హామీ
- అలాంటప్పుడు స్టే అక్కర్లేదని తేల్చి చెప్పిన కోర్టు
- రిపోర్టు కాపీని పబ్లిక్ డొమైన్‌ల నుంచి తొలగించాలని ఆదేశం
- సీఎస్, జస్టిస్ ఘోష్ కమిషన్‌కు నోటీసులు
- కౌంటర్ దాఖలుకు మూడు వారాల గడువు
- ఆ తర్వాత వారంలోగా పిటిషనర్లు రిప్లై కౌంటర్ ఫైల్ చేయాలని ఆర్డర్
- విచారణ అక్టోబర్ 7కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ నివేదిక అమలుపై స్టే ఇవ్వాలని కోరిన కేసీఆర్, హరీశ్ రావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో స్టే ఉత్తర్వులు అక్కర్లేదని కోర్టు తేల్చి చెప్పింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాకే తదుపరి నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని, ఈలోగా ఎలాంటి చర్యలు ఉండబోవని కూడా హామీ ఇచ్చిందని స్పష్టం చేసింది. ‘కమిషన్ రిపోర్టు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంది. అది పిటిషనర్ల పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఉంది” అని కేసీఆర్, హరీశ్ తరఫు లాయర్లు వాదించగా.. రిపోర్టు కాపీని పబ్లిక్ డొమైన్‌ల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీలో రిపోర్టు ప్రవేశపెట్టాలని భావించినప్పుడు.. ఆ కాపీని పబ్లిక్ డొమైన్‌లో ఎలా పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నివేదికలోని సమాచారం వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నట్టు పిటిషనర్లు చెబుతున్నారని పేర్కొంది. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, జస్టిస్ ఘోష్ కమిషన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత వారం రోజుల్లో కౌంటర్లకు
రిప్లై ఫైల్ చేయాలని పిటిషనర్లకు ఆదేశాలిచ్చింది. విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది. కేసీఆర్, హరీశ్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు ఆర్యమ సుందరం, దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. కమిషన్ ఆదేశిస్తే పిటిషనర్లు ఇద్దరూ సాక్షులుగా విచారణకు హాజర య్యారని, 5(2) సెక్షన్ కింద ఇచ్చిన సమన్లలో పిటిషనర్లపై అభియోగాలను కమిషన్ పేర్కొనలేదని చెప్పారు.
‘‘కమిషన్ నివేదికను ప్రభుత్వం గోప్యంగా ఉంచకపోవడం వల్ల పిటి షనర్ల ప్రతిష్ట దెబ్బతిన్నది. కమిషన్ ఇచ్చిన 650 పేజీల రిపోర్టును ముగ్గురు అధికారులతో బ్రీఫ్ చేయించి 60 పేజీలకు కుదించారు. దాని ఆధారంగా సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో పిటిషనర్ల పరువుకు నష్టం జరిగింది. రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా పిటిషనర్లపై ప్రభుత్వం ఏకపక్షంగా దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలి. రాజకీయ కక్ష సాధింపులను నివారించాలంటే రిపోర్టుపై స్టే ఇవ్వాలి”అని కోరారు. ‘‘రిపోర్టులో పిటిషనర్లకు వ్యతిరేకంగా పలు విషయాలు ఉన్నాయి. విచారణకు సాక్షులుగా హాజరైన పిటిషనర్లపై కమిషన్ ఆరోపణలు చేయడం చట్ట వ్యతిరేకం. విచారణ కమిషన్ చట్టం–1952లోని సెక్షన్ 8-బీ, 8-సీ కింద నోటీసులు ఇచ్చి ఆరోపణలు చేసిన వాళ్లను క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు కమిషన్ అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతి రేకం. కాబట్టి కమిషన్ రిపోర్ట్ చెల్లదు. తక్షణమే నివేదికపై స్టే ఇవ్వాలి”అని విజ్ఞప్తి చేశారు.
సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలని ఎల్‌కే అద్వానీ, కిరణ్ బేడీ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కమిషన్ వ్యవహరించిందన్నారు.
పిటిషనర్లకు కమిషన్ నోటీసులు ఇవ్వక్కర్లే ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి, కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కమిషన్ రిపోర్టుపై స్టే జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాకే తదుపరి చర్యలు ఉంటాయన్న ప్రభుత్వ హామీని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ‘‘పిటిషనర్లకు 8-బీ, 8-సీ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదు. కమిషన్ 119 మంది సాక్షుల విచారణలో చిట్టచివరి వ్యక్తులు పిటిషనర్లే. అన్నీ తెలుసు కాబట్టి నోటీసుల జారీ అవసరం లేదు. కమిషన్ నుంచి పిటిషనర్లు సమాచారాన్ని స్వీకరించారు. కిరణ్ బేడీ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు పిటిషనర్లకు వర్తించవు. కేసీఆర్, హరీశ్ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో నివేదించాక జరగబోయే చర్చలో వాళ్లు తమ వాదన చెప్పుకునే వీలుంటుంది. అసెంబ్లీలో చర్చించే వరకు ఏమీ జరగదు. కమిషన్ రిపోర్టు ఇచ్చాక ప్రభుత్వం ముగ్గురు ఆఫీసర్లతో కమిటీ వేసి ఆ రిపోర్టులోని ముఖ్యమైన విషయాలతో 60 పేజీల్లో బ్రీఫ్ రిపోర్టు తయారు చేసింది. అయితే అది మీడియాకు చేరింది. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఆ నివేదిక లేదు. పిటిషనర్లు ఇద్దరూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసులను సవాలు చేయలేదు. కమిషన్ వద్ద ఉన్న సమాచారం ఆధారంగానే పిటిషనర్లు ఇద్దరినీ కమిషన్ విచారించింది. కమిషన్ నిజనిర్ధారణ మాత్రమే చేస్తుంది. కమిషన్ నివేదికపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి”అని చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.
పిటిషనర్లకు ఆందోళన అక్కర్లే..
కాళేశ్వరం ప్రాజెక్టుపై సర్కార్ ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రద్దు చేయాలని, కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై వరుసగా రెండో రోజు శుక్రవారం చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. కమిషన్ నివేదికను అసెంబ్లీ ప్రవేశపెట్టి చర్చించాక ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారా? లేదంటే చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో ప్రవేశపెడతారా? అని గురువారం విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో శుక్రవారం విచారణ సందర్భంగా తొలుత అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు ప్రారంభిస్తూ.. ప్రభుత్వ సమాధానాన్ని అఫిడవిట్ రూపంలో కోర్టుకు అందజేశారు. దాన్ని ధర్మాసనం పరిశీలించింది. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టాకే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కాబట్టి స్టే ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ‘‘ముందు రిపోర్టును అసెంబ్లీలో పెడతామని ప్రభుత్వం చెప్పింది. ఆలోగా ఎలాంటి చర్యలు ఉండవని హామీ ఇచ్చింది. పిటిషనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు”అని తెలిపింది.