- నల్గొండలో 46.5 డిగ్రీల రికార్డు టెంపరేచర్
- రాబోయే మూడు రోజులూ భానుడి భగభగ
- భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా వేములపల్లిలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కుమ్రంభీం, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కూడా ఎండలు దంచికొట్టాయి. అక్కడ 46.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
రాజధాని హైదరాబాద్లో కూడా ఎండల తీవ్రగా ఎక్కువగానే ఉంది. గరిష్టంగా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలతో పాటు వడగాల్పులు రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 145 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 19 మండలాల్లో, మంచిర్యాలలో 17, సూర్యాపేటలో 14, ఖమ్మంలో 13 మండలాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి.
మూడు రోజులూ ఎండలే..
రాబోయే మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో వడగాల్పులు అత్యంత తీవ్రంగా ఉండనున్నాయి.
కుమ్రంభీం ఆసిఫాబాద్ నుంచి వరంగల్, హనుమకొండ వరకు పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో మరో మూడు రోజుల వరకు పెద్దగా మార్పు ఉండకపోయినా, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పొద్దంతా మండే ఎండ.. సాయంత్రం వాన
సూర్యుడి భగభగల మధ్యే సోమవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల సాయంత్రం వేళ స్వల్ప ఉపశమనం లభించింది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ లో 29 మిల్లీమీటర్లు, జహీరాబాద్లో 24.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నం, వెల్దండ, కోహెడ వంటి ప్రాంతాల్లో కురిసిన చిరుజల్లులు కొంత మేర ఉపశమనాన్ని ఇచ్చినా, రాత్రి వేళల్లో ఉక్కపోత మాత్రం తగ్గలేదు.
మరోవైపు నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయని, రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి మరింత ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం వేళల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే చాన్స్ ఉందని పేర్కొన్నారు.
