ఫుట్ బాల్ గ్రౌండ్ పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు జరిమానా

ఫుట్ బాల్ గ్రౌండ్ పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు జరిమానా
  • ఆటస్థలపై ఎలాంటి హక్కు లేదంటూ పిటిషన్‌‌‌‌ కొట్టివేత

హైదరాబాద్, వెలుగు : మేడ్చల్‌‌‌‌-మల్కాజిగిరి జిల్లా అమ్ముగూడలో ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ మైదానంగా వినియోగంలో ఉన్న ప్రభుత్వ భూమిపై హక్కులు కోరడం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా పదేపదే రెవెన్యూ అధికారులను, అనంతరం కోర్టును ఆశ్రయించడం ద్వారా న్యాయస్థానం విలువైన సమయాన్ని వృథా చేశారని పేర్కొంటూ పిటిషనర్లపై రూ.50 వేల జరిమానా విధించి పిటిషన్‌‌‌‌ను కొట్టివేసింది. ఆల్వాల్‌‌‌‌కు చెందిన సర్దార్‌‌‌‌ శాంతాభాయి తదితరులు సర్వే నెం.16/1లోని 7.28 ఎకరాల భూమిని తమ పేర్లపై మ్యుటేషన్‌‌‌‌ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

విచారణలో ప్రభుత్వం ఆ భూమి ప్రభుత్వానిదేనని, 6.18 ఎకరాల్లో ఇప్పటికే లేఔట్‌‌‌‌ వేసి ప్లాట్లు విక్రయించగా, మిగిలిన 1.10 ఎకరాలు జీహెచ్‌‌‌‌ఎంసీ ఆధ్వర్యంలో ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ మైదానంగా వినియోగంలో ఉన్నట్లు తెలిపింది. రికార్డులు పరిశీలించిన జస్టిస్‌‌‌‌ ఈ.వి. వేణుగోపాల్‌‌‌‌, ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన ఆటస్థల భూమిపై పిటిషనర్లకు ఎలాంటి హక్కులు లేవని తేల్చి, జరిమానా మొత్తాన్ని హైకోర్టు అడ్వొకేట్స్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌కు చెల్లించాలని ఆదేశించారు.