- వారంపాటు తాత్కాలిక ముందస్తు బెయిలు
హైదరాబాద్, వెలుగు: గౌహతిలో నమోదైన కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కేసు నమోదైన అస్సాంలో సంబంధిత కోర్టును ఆశ్రయించడానికి అవకాశం కల్పిస్తూ వారం రోజులపాటు తాత్కాలిక ముందస్తు బెయిలును మంజూరు చేస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గౌహతిలో నమోదైన కేసులో అరెస్ట్ అవకాశాలున్నాయని, అందువల్ల ముందస్తు బెయిలు మంజూరు చేయలని కోరుతూ పవన్ ఖేరా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె. సుజన విచారణ చేపట్టి షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేశారు. రూ.లక్ష వ్యక్తిగత బాండుతోపాటు అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తును గౌహతి దర్యాప్తు అధికారికి సమర్పించాలన్నారు. దర్యాప్తునకు అందుబాటులో ఉండి సహకరించాలన్నారు. ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ సాక్షులను బెదిరింపులకు, ప్రలోభాలకు గురిచేయరాదన్నారు. సంబంధిత కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్నారు. వారంలోగా కేసు నమోదైన ప్రాంత పరిధిలోని కోర్టును ఆశ్రయించి చట్టప్రకారం ఉపశమనం పొందవచ్చన్నారు.
