
- మీరు ఎన్నికలు నిర్వహించినా మేం కేసు విచారిస్తం
- గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఎలా ఇచ్చారు
- సెక్షన్ 285ఏ సవరించి 3 నెలలు కాకుండానే జీవో ఎందుకు?
- కోర్టుల జోక్యం ఉండకూడదంటే ఎలా?
- పది రోజుల ఎన్నికలు వాయిదా వేసుకోండి
- ఆగస్టు 31న గవర్నర్ కు పంపి.. నెల తిరగక ముందే జీవో ఇస్తారా?
- మూడు నెలల పరిమితిని సుప్రీం విధించింది కదా
- బీసీ రిజర్వేషన్లపై చట్ట ప్రకారం ముందుకెళ్లండి
హైదరాబాద్: బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పై ఇవాళ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగా ప్రభుత్వం జీవో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని బెంచ్ ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మూడు నెలల కాల పరిమితి ఉందని, ఆగస్టు 31న గవర్నర్ పరిశీలనకు బిల్లు పంపి నెల రోజులు కూడా కాకముందే ఎలా జీవో జారీ చేస్తారని అడ్వొకేట్ జనరల్ ను ప్రశ్నించింది. కేసు వాయిదా వేస్తే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని పిటిషన్ తరఫు న్యాయవాది తెలిపారు. దీనిపై ఏజీ సుదర్శన్ రెడ్డిని బెంచ్ ప్రశ్నించింది. ఈ అంశంపై రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, చట్ట సభను గౌరవించాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు గవర్నర్ కు పంపిన బిల్లుకు ఇంకా గడువు ఉందని నవంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. సింగిల్ బెంచ్ సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిందని ఏజీ ధర్మాసనానికి తెలిపారు. కేసు విచారణను ఈ నెల అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వవదని సూచించింది. పది రోజుల పాటు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని సూచించింది.
నవంబర్ వరకు ఆగండి
42% పెంచుకోవాలనుకుంటే నవంబర్ వరకు ఆగాలని బెంచ్ సూచించింది. గవర్నర్ ఏమీ చెప్పకుంటే ఆ బిల్లు పాస్ అయినట్టే కదా? అప్పటి వరకు ఆగాల్సిందేనని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే రిట్ పిటిషన్లు అడ్మిషన్ కాదు.. అప్పుడెలా..? అని బెంచ్ ప్రశ్నించింది. విచారణ సందర్భంగా పది రోజుల వరకు ఎన్నికలు ఆపగలరా..? అని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా మెరిట్స్ ప్రకారం విచారణ నిర్వహిస్తామని బెంచ్ తెలిపింది. 3.