మార్చి 26వ తేదీలోగా ఎన్‌సీసీకి 50%  బకాయిలు చెల్లించండి : హైకోర్టు

మార్చి 26వ తేదీలోగా ఎన్‌సీసీకి 50%  బకాయిలు చెల్లించండి : హైకోర్టు
  • ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : మిషన్‌ భగీరథ కింద పనులు పూర్తి చేసిన ఎన్‌సీసీ సంస్థకు ఈ నెల 26లోగా బకాయి పడ్డ బిల్లుల్లో 50 శాతం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చెల్లించకుంటే 30న రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు తాగునీటి పథకాల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఎన్‌సీసీ లిమిటెడ్‌కు ప్రభుత్వం రూ.180.17 కోట్ల బిల్లులు బకాయి పడింది. వీటిని 2 నెలల్లోగా చెల్లించాలని గతేడాది ఆగస్టులోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గడువు ముగిసినా చెల్లించకపోవడంతో సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను వేసింది.

దీనిపై జస్టిస్‌ టి.మాధవీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రితో భేటీ ఉన్నందున.. శుక్రవారం విచారణకు హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని సందీప్ సుల్తానియా కోరగా.. అంగీకరించారు. బిల్లుల చెల్లింపునకు నాలుగు వారాల గడువు కావాలని కోరగా.. కోర్టు నిరాకరించింది. కనీసం 50 శాతం బకాయిలనైనా ఈ నెల 26లోపు చెల్లించాల్సిందేనని తేల్చి చెబుతూ విచారణను వాయిదా వేసింది.