రాష్ట్రంలో 17 మంది జిల్లా జడ్జీలు బదిలీ

రాష్ట్రంలో 17 మంది జిల్లా జడ్జీలు బదిలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పనిచేస్తున్న 17 మంది జడ్జీలను బదిలీచేస్తూ శనివారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కోర్టు జడ్జి సీహెచ్‌‌  రమేశ్ బాబు మినహా మిగిలిన అందరూ మే 1లోగా కొత్త పోస్టుల్లో బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు పేర్కొంది. రమేశ్ బాబు మే 1న రిలీవ్‌‌  కావాలని సూచించింది. ఈలోగా బదిలీ అయిన జడ్జీలంతా రిజర్వు చేసిన కేసుల్లో తీర్పులు చెప్పాలని ఆదేశించింది. శనివారం హైకోర్టు రిజిస్ట్రార్‌‌  జనరల్‌‌  పేరిట బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. 

సిద్దిపేట ప్రిన్సిపల్‌‌  డిస్ట్రిక్ట్‌‌  అండ్‌‌ సెషన్స్‌‌  జడ్జి డాక్టర్‌‌  టి.రఘురాంను సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్‌‌  జడ్జిగా నియమించారు. సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్‌‌  జడ్జిగా పనిచేస్తున్న సీహెచ్‌‌ రమేశ్‌‌ బాబును హన్మకొండకు బదిలీ చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రైబ్యునల్‌‌  చైర్మన్‌‌  సురేశ్ ను నాంపల్లి కోర్టు మెట్రోపాలిటన్‌‌  సెషన్స్‌‌ జడ్జిగా, సిద్దిపేట మొదటి అదనపు జిల్లా జడ్జి మురళీ మోహన్‌‌ ను సిటీ సివిల్‌‌ కోర్టు 9వ అదనపు చీఫ్‌‌  జడ్జిగా బదిలీ చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్‌‌ (ఇన్‌‌ఫ్రా) నర్సింగ్‌‌ రావును సిటీ స్మాల్‌‌ కాజెస్‌‌  కోర్టు చీఫ్‌‌ జడ్జిగా, మరో రిజిస్ట్రార్‌‌ (అడ్మినిస్ట్రేషన్‌‌) ఖాల బాస్కర్‌‌ ను మేడ్చల్‌‌  మల్కాజిగిరి కోర్టు పీడీజీగా ట్రాన్స్ ఫర్  చేశారు. 

మేడ్చల్‌‌  మల్కాజిగిరి కోర్టులో పనిచేస్తున్న మధుసూదన్‌‌ రావును హైకోర్టు రిజిస్ట్రార్‌‌ (అడ్మినిస్ట్రేషన్‌‌) గా నియమించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్‌‌లోని ఫ్యామిలీ కోర్టు అదనపు జడ్జి సీహెచ్‌‌ పంచాక్షరీని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా నియమించారు. ఆ పదవిలో ఉన్న ఎస్‌‌.గోవర్ధన్‌‌ రెడ్డిని సూర్యాపేట పీడీజీగా బదిలీ చేశారు.