- నిర్మాణాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు
- విచారణ ఆగస్టు 11కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 28, 62లోని భూముల్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వంగానీ, అధికారులుగానీ ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటే చట్టప్రకారమే వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు.
ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున పోలీసులు, రెవెన్యూ అధికారులు బహదూర్‌గూడలోని నివాసాలను కూల్చివేసి రైతులను బలవంతంగా ఖాళీ చేయించడాన్ని సవాల్ చేస్తూ ఆర్. కృష్ణమోహన్‌రాజుతో పాటు మరో 84 మంది రైతులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తమకు చెందిన సుమారు 48 ఎకరాల భూముల్లో అధికారులు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ముస్తాంగ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లను కలిపి హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది హనుమంతరావు వాదిస్తూ..కూల్చివేసిన నిర్మాణాలను పునరుద్ధరించాలని, ఒక్కో రైతుకు రూ.2 కోట్ల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
మహిళలు, రైతులపై ప్రభుత్వం జరిపిన దాడులపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ..బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 650 ఎకరాల భూమి సేకరిస్తోందని తెలిపారు. కోర్టు స్పందిస్తూ..భూముల యాజమాన్య హక్కుల్లో వివాదాస్పద అంశాలు ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని, పిటిషనర్లకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా చట్ట ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
