తెలంగాణ హైకోర్టు మంత్రి సీతక్కపై కేసు కొట్టివేత

తెలంగాణ హైకోర్టు మంత్రి సీతక్కపై కేసు కొట్టివేత

హైదరాబాద్, వెలుగు: మంత్రి సీతక్కపై కొవిడ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సుజన విచారణ జరిపి, ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు. 2021 ఏప్రిల్ 26న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఆరోగ్యశ్రీ పరిధిలో కొవిడ్ చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ సీతక్కతో పాటు కాంగ్రెస్ నాయకులు నిరాహార దీక్ష నిర్వహించారు.

దీనిపై గాంధీనగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 188, 269, 270తో పాటు విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51(బి) కింద కేసు నమోదు చేశారు. అయితే సెక్షన్ 188 కింద విచారణకు సంబంధిత ప్రజాసేవకుడి లిఖితపూర్వక ఫిర్యాదు తప్పనిసరి అని, పోలీసుల చార్జిషీట్ ఆధారంగా విచారణ ప్రారంభించడం చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే కేసులో ఐపీసీ సెక్షన్లు 269, 270 వర్తించేలా ప్రాథమిక ఆధారాలు కూడా లేవని పేర్కొంటూ సీతక్కపై కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేసింది.