హైదరాబాద్, వెలుగు: లిక్కర్ షాపులకు అప్లికేషన్ల స్వీకరణ గడువును ఎలా పొడిగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వమే రూల్స్ తయారు చేసి వాటిని తిరిగి ప్రభుత్వమే ఎలా ఉల్లంఘిస్తుందని నిలదీసింది. ఏ రూల్స్ ప్రకారం గడువు పొడిగించారో చెప్పాలని, లేకపోతే లిక్కర్ షాపుల ఎంపిక ప్రక్రియను నిలిపివేస్తూ స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది.
ప్రభుత్వ వివరణ కోసం విచారణను శనివారానికి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ తుకారాంజీ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో లిక్కర్ షాపుల దరఖాస్తు గడువు పెంచితే నష్టమేంటని పిటిషనర్లను కూడా హైకోర్టు ప్రశ్నించింది. మద్యం షాపుల దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగుస్తుందని నోటిఫికేషన్‌లో ఉందని, దీన్ని ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా ఈ నెల 23 వరకు పెంచిందని హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్వర రావు ఇతరులు పిటిషన్లు వేశారు.
శుక్రవారం ఇరుపక్షాల వాదనలు జరిగినప్పుడు హైకోర్టు రెండు పక్షాలను నిలదీసింది. హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన డి.వెంకటేశ్వర రావు సహా ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎన్.తుకారాంజీ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదిస్తూ.. తొలుత దరఖాస్తుల గడువు ఈ నెల 18 వరకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిని ఈ నెల 23 వరకు గడువు పెంచడం చెల్లదన్నారు.
ఈ నెల 18వ తేదీ తర్వాత పోటీ పెరగడంతో మద్యం దుకాణాలు పొందే అవకాశాలు తగ్గాయన్నారు. దరఖాస్తుల గడువు పెంపు నిర్ణయం రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టంలోని నిబంధన 12(5)లకు విరుద్ధమన్నారు. కాగా, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మద్యం దుకాణాల కోసం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యిందని, గడువు పెంపును మాత్రమే సవాలు చేశారని, గెజిట్‌ను కాదని, కాబట్టి స్టే ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు.
మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే గడువు పెంచాక స్వీకరించిన 5,793 దరఖాస్తుదారులకే పరిమితం చేయాలని కోరారు. గడువు పెంపు తర్వాత తీసుకున్న దరఖాస్తుదారులకు దుకాణం పొందినట్లయితే వాటిని రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. డిపాజిట్ సొమ్మునూ తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు.
