
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై మధ్యంతర స్టే విధించింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయటానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు విధించింది. అదే విధంగా ప్రభుత్వ కౌంటర్ పై.. పిటీషనర్ కౌంటర్ దాఖలు చేయటానికి రెండు వారాల గడువు విధించింది.
రాష్ట్రంలో కుల గణన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. విచారణ చేసిన హైకోర్టు.. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ జీవో 9పై మధ్యంతర స్టే విధించింది.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9వ తేదీ ఉదయం నోటిఫికేషన్ జారీ అయ్యింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా మొదలైంది. రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించటంతో.. ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉండబోతుంది.. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.