V6 News

ఇక దోస్త్ ద్వారానే ఇంటిగ్రేటెడ్ కోర్సులు

ఇక దోస్త్ ద్వారానే ఇంటిగ్రేటెడ్ కోర్సులు
  •     డిగ్రీతో పాటే పీజీ ఐదేండ్ల కోర్సులకు అడ్మిషన్లు 
  •     అడ్మిషన్ల ఆలస్యాన్ని తగ్గించేందుకు టీజీసీహెచ్ఈ నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీగెట్) ద్వారా జరుగుతున్న ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల అడ్మిషన్లు ఇకపై  ‘డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ’ (దోస్త్ ) ద్వారా నిర్వహించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం 2026–-27 నుంచి ఇది అమలు చేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. అడ్మిషన్ల ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. 

ఒకే దరఖాస్తుతో డిగ్రీ, పీజీ..

ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా పీజీ పట్టా పుచ్చుకునేలా రూపొందించిన ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులకు క్రేజ్ పెరుగుతోంది. ఐదేండ్ల పాటు సాగే ఈ విద్యా ప్రయాణంలో యూజీతో పాటు పీజీ డిగ్రీని కూడా ఒకేసారి పూర్తి చేయవచ్చు. గతంలో పీజీ ఎంట్రన్స్ ద్వారా ఈ సీట్లను భర్తీ చేయడం వల్ల అడ్మిషన్లు ఆలస్యమవుతున్నాయని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని, కౌన్సిల్ అధికారులతో పాటు వివిధ వర్సిటీల వైస్ ఛాన్సలర్లు సమావేశమై ఇకపై దోస్త్ పోర్టల్ ద్వారానే అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయించారు. 

మొత్తం 370 సీట్లు.. 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్సిటీల క్యాంపస్ లు, అనుబంధ కాలేజీల్లో మొత్తం 370 సీట్లు ఉన్నాయి. ఎంఎస్సీ బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్. ఎంబీఏ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.