కాసేపట్లో  తెలంగాణ జాగృతి కమిటీలతో ఎమ్మెల్సీ కవిత భేటీ

కాసేపట్లో  తెలంగాణ జాగృతి కమిటీలతో ఎమ్మెల్సీ  కవిత భేటీ

హైదరాబాద్: తెలంగాణ జాగృతి మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఉద్యమం సమయంలో కీలకంగా పని చేసిన తెలంగాణ జాగృతి.. రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు సైలెంట్ అయిపోయింది. కేవలం బోనాలు, బతుకమ్మ ఉత్సవాలకే పరిమితమైంది. జాగృతికి ఎమ్మెల్సీ కవిత  అధ్యక్షురాలిగా ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిన్న కవితను ప్రశ్నించిన విషయం తెలిసిందే. తొలుత న్యాయవాది సమక్షంలో విచారించిన సీబీఐ అధికారులు ఆ తర్వాత న్యాయవాదిని బయటకు పంపి విచారించారు. ఉదయం 11 నుంచి రాత్రి వరకు దాదాపు 7.30 గంటలకు పైగా సీబీఐ అధికారులు.. కవితను ప్రశ్నించారు. సీబీఐ విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్నటి సీబీఐ విచారణ కు కౌంటర్ గా కవిత.. జాగృతి కమిటీలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మధ్యాహ్నం ముషీరాబాద్లో కీలక సమావేశం

ఇవాళ మధ్యాహ్నం ముషీరాబాద్ లో తెలంగాణ జాగృతి కీలక సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. రాష్ట్ర, జిల్లాల జాగృతి బాధ్యులు ఈ మీటింగ్ కు హాజరవుతున్నట్లు సమాచారం. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న జాగృతి.. కవితను సీబీఐ ప్రశ్నిస్తున్న సమయంలో యాక్టివ్ కావడం ఆసక్తికరంగా మారింది. ఇవాళ మీటింగ్ లో ఏం జరగనుంది..? ఏ విషయాలపై చర్చిస్తారు..? అన్నది ఆసక్తికరంగా మారింది.