హైదరాబాద్, వెలుగు: ఆగస్టు 15 లోపు రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. తెలంగాణ జలసిరి పనుల్లో వేగం పెంచాలని, ఈ లక్ష్యాన్ని సాధించిన అధికారులు, పంచాయతీలు, ప్రజాప్రతినిధులను సీఎం చేతుల మీదుగా సన్మానిస్తామన్నారు. శనివారం సచివాలయం నుంచి స్పెషల్ సీఎస్ దానకిశోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మీతో కలిసి అడిషనల్ కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, సీఈవోలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వీబీ జీ రామ్జీ అమలు, తెలంగాణ జలసిరి పనులు, జీపీ ఎస్ఏపీ రూపకల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీబీ జీ రామ్ జీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో మరింత వేగవంతంగా అమలు చేయాలని, తెలంగాణ జలసిరి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
గ్రామాల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణగా గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను శాస్త్రీయంగా రూపొందించాలని సూచించారు. ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించాలని, వీబీ జీ రామ్జీ పరిధిలోని 318 రకాల పనులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా గుర్తించి వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
