మండలి బిల్డింగ్ ఇక కొత్తగా.. పూర్తయిన రెనోవేషన్ పనులు.. 8న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

మండలి బిల్డింగ్ ఇక కొత్తగా.. పూర్తయిన రెనోవేషన్ పనులు.. 8న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • బడ్జెట్ సమావేశాలు అందులోనే: కౌన్సిల్ చైర్మన్ గుత్తా
  • రూ.30 కోట్లతో ఏడాదిన్నరలో కొత్తరూపు
  • అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు
  • వీలైతే ఈ నెల 8నే ప్రారంభోత్సవం
  • ఆదర్శనగర్​లో 9 ఎకరాల్లో కాన్​స్టిట్యూషన్ కబ్ల్ నిర్మాణం
  • బడ్జెట్ సెషన్ తర్వాత పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్ పనులు ప్రారంభిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: శాసన మండలికి కొత్త హంగు లతో మరో భవనం సిద్ధమైంది. అసెంబ్లీ భవనాన్ని ఆనుకునే ఉన్న పాత భవనంలో శాసన మండలి హాల్, చాంబర్ల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించనున్నట్టు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన తన చాంబర్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు ఈ కొత్త భవనంలోనే కొనసాగుతాయని చెప్పారు. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏపీకి కేటాయించిన ఈ భవనాన్ని.. వారు అమరావతికి వెళ్లిన తర్వాత, ఖాళీగా అట్లనే  ఉంచితే పాడవుతుందనే ఉద్దేశంతో, హెరిటేజ్ భవనం కావడంతో కౌన్సిల్ భవనంగా మార్చుకోవాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనను ఆచరణలో పెట్టామన్నారు. ఇప్పుడు ఇటు అసెంబ్లీ అటు కౌన్సిల్ పక్క పక్కనే ఉండడంతో అసెంబ్లీ ఆవరణకే కొత్త కళ వచ్చిందన్నారు. 2024 అక్టోబర్​లో ఆగాఖాన్ సంస్థ.. ఆర్ అండ్ బీ అధికారులు సంయుక్తంగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభించాయని, ఏడాదిన్నరలో పూర్తి చేశాయని ఆయన చెప్పారు. 

రూ.30 కోట్ల ఖర్చుతో ఈ భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఇందులో 80 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందులో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చాంబర్, కౌన్సిల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ చాంబర్ లు, మండలి కార్యదర్శి ఆఫీసు, కౌన్సిల్ సెక్రటేరియెట్​తో పాటు మీడియాకు హాల్ ఏర్పాటు చేసినట్టు మండలి చైర్మన్​ గుత్తా చెప్పారు.

జూబ్లీహాల్​ పునరుద్ధరణ

రాబోయే 40 నుంచి 50 ఏండ్ల వరకు ఈ భవనానికి ఎలాంటి ఢోకా లేదని గుత్తా అన్నారు. ప్రస్తుతం ఉన్న శాసన మండలి భవనాన్ని, జూబ్లీహాల్​ను పునరుద్ధరణ చేసి ప్రభుత్వపరమైన కార్యక్రమాలకు వాడుకోనున్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ నెల 8 లోపు ఈ పనులు పూర్తయితే కౌన్సిల్ ప్రారంభోత్సవం రోజునే ఈ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకుంటామని చెప్పారు. 

అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు పక్కపక్కనే ఉండడంతో ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్​ను కూడా త్వరలోనే నిర్మిస్తామని వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకే చోట కూర్చొని మాట్లాడుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దుతామన్నారు. బడ్జెట్ సెషన్ తర్వాత ఈ పనులు ప్రారంభం కానున్నట్టు ఆయన తెలిపారు. దేశంలోనే తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు, సెంట్రల్ హాల్ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. ఆదర్శ నగర్​లో ఉన్న 9 ఎకరాల స్థలంలో కాన్​స్టిట్యూషన్ క్లబ్​ను నిర్మిస్తామన్నారు. 


వచ్చే ఎన్నికలు జమిలీగానే..

వచ్చే ఎన్నికలు జమిలీగానే జరుగుతాయని మండలి చైర్మన్​ గుత్తా తెలిపారు. నియోజక వర్గాల పునర్విభజన ఉంటుందని, మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వస్తాయని, రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు రానున్నా యని చెప్పారు. ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా మారుతాయన్నారు. తాను మాత్రం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని, మళ్లీ అవకాశం వస్తే మండలిలోనే ఉంటా అన్నారు. మా అబ్బాయి అమిత్ రెడ్డికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాడని, రాజకీయాల్లోకి వచ్చాక పోటీ చేయకుండా ఉంటాడా అని అన్నారు.