తెలంగాణ నెత్తిన పిడుగు.. ఒక్క రోజే 9 మందిని పొట్టన పెట్టుకున్న పిడుగుపాటు

తెలంగాణ నెత్తిన పిడుగు.. ఒక్క రోజే 9 మందిని పొట్టన పెట్టుకున్న పిడుగుపాటు
  • గద్వాల, నిర్మల్‌‌ జిల్లాల్లో ముగ్గురు చొప్పున..
  • ఖమ్మం జిల్లాలో ఇద్దరు..భద్రాద్రి జిల్లాలో ఒకరు మృతి
  • అయిజలో ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

రాష్ట్రంలోని పలు చోట్ల బుధవారం (సెప్టెంబర్ 10) పిడుగులు పడడంతో తొమ్మిది మంది చనిపోయారు. రైతులు, కూలీలు పొలాల్లో పనిచేస్తున్న టైంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడ్డాయి. దీంతో గద్వాల, నిర్మల్‌‌ జిల్లాలో ముగ్గురు చొప్పున, ఖమ్మం జిల్లాలో ఇద్దరు, భద్రాద్రి జిల్లాలో ఒకరు చనిపోగా.. మరికొందరు గాయపడ్డారు.

అయిజ, వెలుగు : గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండ, భూంపురం గ్రామాల శివారులో బుధవారం పిడుగు పడి ముగ్గురు చనిపోగా, మరో నలుగురికి గాయాలు అయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పార్వతమ్మ (22), సర్వేశ్‌‌ (20), సౌభాగ్యమ్మ (40)తో పాటు రాజు, జ్యోతి, తిమ్మప్ప, కావ్య కలిసి ఆంజనేయులు అనే రైతుకు చెందిన పత్తి చేనులో పని చేసేందుకు వెళ్లారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన చిన్నపాటి వర్షం పడింది. దీంతో కూలీలు సమీపంలో ఉన్న చెట్టు కిందికి వెళ్లారు. ఈ టైంలో చెట్టుపై పిడుగు పడడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

చుట్టుపక్కల రైతులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో పాటు, గాయపడిన వారిని అయిజ హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు పార్వతమ్మ, సర్వేశ్‌‌, సౌభాగ్యమ్మ చనిపోయినట్లు నిర్ధారించారు. మిగిలిన నలుగురిని గద్వాల హాస్పిటల్‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

నిర్మల్‌‌ జిల్లాలో దంపతులతో పాటు బంధువు..

పెంబి, వెలుగు : నిర్మల్‌‌ జిల్లా పెంబి మండలం గుమ్మేనా ఎంగ్లాపూర్‌‌ గ్రామంలో బుధవారం పిడుగుపడడంతో దంపతులతో పాటు వారి బంధువు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఆలకుంట ఎల్లయ్య (50), ఆలకుంట లక్ష్మి (45) దంపతులు. వారు తమ బంధువు బండారి వెంకటి (60)తో కలిసి బుధవారం గ్రామ శివారులోని ఓ వ్యక్తికి చెందిన పత్తి చేనుకు కావలి కాసేందుకు వెళ్లారు. వారు మంచె వద్ద ఉన్న టైంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. 

భద్రాద్రి జిల్లాలో రైతు...

గుండాల, వెలుగు : పిడుగుపాటుకు ఓ రైతు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చీమలగూడెంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన నరసయ్య (58)మంగళవారం సాయంత్రం మక్కజొన్న చేనుకు కాపలాగా వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లి చూడగా.. చనిపోయి కనిపించాడు. నరసయ్య చేను వద్దకు వచ్చిన టైంలో పిడుగు పడడం వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఖమ్మం జిల్లా మధిరలో ఒకరు, సత్తుపల్లిలో మరొకరు..

మధిర/సత్తుపల్లి/కామేపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామానికి చెందిన గడిపూడి వీరభద్రరావు (55) బుధవారం మధ్యాహ్నం తన మిర్చి పొలంలో పనిచేస్తున్నాడు. ఈ టైంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగు పడడంతో వీరభద్రరావు అక్కడికక్కడే చనిపోయాడు. సత్తుపల్లి మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ధరావత్‌‌ మహేశ్‌‌ (33) బుధవారం పశువులను తోలుకొచ్చేందుకు చేను వద్దకు వెళ్లాడు. 

ఈ టైంలో పిడుగు పడడంతో మహేశ్‌‌ అక్కడికక్కడే చనిపోయాడు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని కొమ్మినేపల్లిలో పిడుగు పడడంతో అదే గ్రామానికి చెందిన రైతు గుగులోత్‌‌ బావ్‌‌ సింగ్‌‌ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108లో ఖమ్మం హాస్పిటల్‌‌కు తరలించారు.