
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గురువారం (అక్టోబర్ 09) 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో జిల్లాల్లో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం.
స్థానిక ఎన్నికలు మొత్తం ఐదు విడతల్లో జరుగుతున్నాయి. రెండు విడతలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. మూడు విడతలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. అందులో భాగంగా గురువారం ఉదయం 10:30 గంటలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ ప్రారంభం అయ్యింది.
రాష్ట్రంలోని 2,963 ఎంపీటీసీ స్థానాలు, 292 జడ్పీటీసీ స్థానాలకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరిస్తున్నారు అధికారులు. మొదటి విడత ఎన్నికల నామినేషన్లు అక్టోబర్ 9 నుంచి 11 వరకు స్వీకరిస్తారు. అక్టోబర్ 23న పోలింగ్ ఉంటుంది.
రెండో విడత ఎన్నికల నామినేషన్ అక్టోబర్ర 13 నుండి 15 వరకు స్వీకరించి అక్టోబర్ 27 న పోలింగ్ నిర్వహిస్తారు. రెండవ విడతలో 2,786 ఎంపీటీసీ స్థానాలు 273 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరుగనుంది.
మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు..
ఇక సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తారు. మొదటి విడత ఎన్నికల నామినేషన్లు అక్టోబర్ 17 నుంచి 19 వరకు స్వీకరించి అక్టోబర్ 31న పోలింగ్ తో పాటు రిజల్ట్ ఉంటుంది. రెండవ విడత ఎన్నికల నామినేషన్లు అక్టోబర్ 21 నుంచి 23 వరకు స్వీకరించి నవంబర్ 4న పోలింగ్ నిర్వహిస్తారు. మూడవ విడత ఎన్నికల నామినేషన్లు అక్టోబర్ 25 నుంచి 27 వరకు స్వీకరించి నవంబర్ 8న పోలింగ్ రోజునే రిజల్ట్ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల733 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.