- రాష్ట్రానికి నిధుల్లో కోత..ఫెడరలిజంపై దాడే: మంత్రి తుమ్మల
- కేంద్రానికి పన్నుల రూపంలోరాష్ట్రం ఇచ్చిందిరూ.1.33 లక్షల కోట్లు
- తిరిగి వచ్చింది రూ.51 వేల కోట్లే..రూపాయి ఇస్తే 30 పైసలే వెనక్కి
- యూపీ, బిహార్ రూపాయి ఇస్తే తిరిగి వాటికి రూ.4 ఇస్తున్నరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.1,33,208 కోట్ల పన్నులు వసూలైతే, రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది కేవలం రూ.51,725 కోట్లు మాత్రమేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘‘అన్ని తెచ్చాం, ఇన్ని చేశాం’’ అని మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశ ఆదాయానికి వెన్నెముకగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలకు తిరిగి ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ, రాజకీయ ఉద్దేశాలతో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. 2018–-19 నుంచి 2022–23 వరకు ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వసూలైన మొత్తం పన్నులు రూ.90.80 లక్షల కోట్లు కాగా, ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా రూ.22.86 లక్షల కోట్లు అన్నారు.
దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఇస్తున్న రూపాయికి సగటున 30 పైసలు తిరిగి ఇస్తుండగా, ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్‌లకు అవి చెల్లిస్తున్న ఒక్క రూపాయికి రిటర్న్‌గా రూ.4 చొప్పున ఇస్తున్నారని తెలిపారు. ఈ నిధులను పోల్చి చూస్తే కేంద్రం ద్వంద్వ వైఖరి బయటపడుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఆర్థిక వివక్ష చూపుతున్నదని, ఇది ఫెడరల్ వ్యవస్థపై దాడిగా పరిగణించాల్సి ఉందన్నారు.
2024–25లో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన రూ.51,725 కోట్లలో కేంద్ర పన్నుల వాటా రూ.27,050 కోట్లు, గ్రాంట్లు రూ.7,913 కోట్లు, ప్రాయోజిక పథకాలు రూ.16,762 కోట్లు ఉన్నట్లు, పార్లమెంట్ లో కేంద్ర మంత్రి సమాధానం చెప్పినట్లు గుర్తుచేశారు. జీఎస్టీ సవరణలతో రాష్ట్రం ఏటా రూ.8 వేల కోట్లు నష్టపోతున్నదని, 15వ ఆర్థిక సంఘం సూచించిన రెవెన్యూ లోటు గ్రాంట్లను 16వ సంఘం పక్కనపెట్టడంతో మరో రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నదని వివరించారు. ఇది రాజకీయ నిర్ణయమని, బలమైన రాష్ట్రాలను బలహీనపరచాలనే ఉద్దేశమని ఆరోపించారు.
