లక్ష టన్నుల వడ్లకు జాగ లేదు: మిల్లులో పాత స్టాక్ 3.36 లక్షల టన్నులు

లక్ష టన్నుల వడ్లకు జాగ లేదు: మిల్లులో పాత స్టాక్ 3.36 లక్షల టన్నులు
  • ప్లేస్ లేదంటూ మిల్లర్ల కొర్రి.. స్థలాన్ని వెతుకుతున్న ఆఫీసర్లు 
  • కొన్ని మిల్లులో ఆన్ లోడ్ కాని లారీలు 
  • ఇప్పటి వరకూ 2.50 లక్షల టన్నులు కొనుగోలు 
  • ఇంకా 2 లక్షల టన్నులు టార్గెట్

యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి వడ్ల కొనుగోలుకు జాగ పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే తాత్కాలిక గొడౌన్లు తీసుకున్నారు. అయినా కొనుగోలు చేస్తున్న వడ్లకు జాగ సరిపోవడం లేదు. దీంతో పక్క జిల్లాల్లో జాగ దొరుకుతుందేమోనన్న వేటలో ఆఫీసర్లు పడ్డారు.

2.40 లక్షల టన్నుల కొనుగోలు.. 
యాదాద్రి జిల్లాలో ఈ యాసంగి సీజన్​లో 3.14 లక్షల ఎకరాల్లో వరి పండించారు. 6.92 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని, ఇందులో 4.50 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని టార్గెట్​గా నిర్ణయించారు. ఇప్పటివరకూ 2.40 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. 2.10 లక్షల టన్నుల వడ్లను మిల్లులకు పంపించారు. అయితే హమాలీల సమస్య కారణంగా మిల్లుల్లో వడ్లు స్పీడ్​గా అన్​లోడ్​ కావడం లేదు. 

పైగా మిల్లుల్లో స్పేస్​ కొరత ఉందని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. దీంతో మిల్లులకు వెళ్లిన లారీలు రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయి.  దీంతో మరో 30 వేల టన్నుల వడ్లు కొనుగోలు సెంటర్లలోనే ఉన్నాయి.

పాత స్టాక్​ 3.25 లక్షల టన్నులు..
జిల్లాలోని మిల్లుల్లో ఇప్పటికే లక్షల టన్నుల వడ్ల స్టాక్​  ఉంది. సీఎంఆర్​లో మిల్లర్లు జాప్యంతో పాటు ఎఫ్​సీఐ పాత్ర కూడా ఉండడంతో మిల్లుల్లో స్టాక్​ పేరుకుపోయింది. 2022 యాసంగి సీజన్​కు సంబంధించి 39 వేల టన్నులు, 2025 యాసంగికి చెందిన 86 వేల టన్నుల వడ్లు, వానాకాలం సీజన్​కు చెందిన 2 లక్షల టన్నుల వడ్ల స్టాక్​ అలాగే ఉంది. 

మొత్తంగా మిల్లుల్లో 3.25 లక్షల టన్నుల వడ్లు ఉన్నాయి. వీటితో పాటు తాజాగా కొనుగోలు చేసిన 2.50 లక్షల టన్నులను కలుపుకుంటే 5.65 లక్షల టన్నుల వడ్లు మిల్లుల్లోనే ఉన్నాయి. ఈ పరిణామంతో మిల్లుల్లో వడ్లను స్టోర్​ చేయడానికి జాగ సమస్య నెలకొంది. 

లక్ష టన్నుల వడ్లకు జాగ లేదు..
టార్గెట్​ ప్రకారం మరో 2 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాల్సి ఉన్నా  కొనుగోలు సెంటర్లలో అంతకు మించిన వడ్ల కుప్పలు నిల్వలు ఉన్నాయి. ఇప్పటికే స్పేస్​ కొరత కారణంగా 60 వేల టన్నుల కెపాసిటీ కలిగిన ఇంటర్మీడియట్​ గోడౌన్లు తీసుకొని అన్​లోడ్​ చేయించే పనిలో ఉన్నారు. అయినప్పటికీ మరో లక్ష టన్నుల వడ్లను స్టోర్​ చేయడానికి జాగ లేదు.

ఇందులో 25 వేల టన్నుల వడ్లను జనగామ జిల్లాకు పంపించడానికి ఓకే చేసినా అక్కడి మిల్లులకు సీఎంఆర్​ కోసం బాయిల్డ్​ కాకుండా ఎక్కువగా రా రైస్​ ఇచ్చారు. దీంతోపాటు అక్కడి మిల్లర్లు తాము మూసీ పరిధిలోని పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట, బీబీనగర్​ మండలాల పరిధిలోని వడ్లు తీసుకోమని ఇప్పటికే చెప్పేశారు. చివరకు 5 వేల టన్నుల వడ్లను తీసుకోవడానికి ఓకే చెప్పారు. హన్మకొండకు మరో 2500 టన్నుల వడ్లకు ఓకే చెప్పారు. 

జాగ వేటలో ఆఫీసర్లు.. 
వడ్లను స్టోర్​ చేయడానికి సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ జాగ వేటలో పడింది. ఇందులో భాగంగానే చౌటుప్పల్​లోని ఓ ప్రయివేటు గోడౌన్​లో 10 వేల టన్నుల వడ్లు స్టోర్​ చేసే జాగను తీసుకున్నారు. వంగపల్లిలో 12 వేల టన్నుల గోడౌన్​, సూర్యాపేట జిల్లాలోని తిర్మలగిరిలోనూ మరో 10 వేల టన్నులు స్టోర్​ చేయడానికి తీసుకున్నారు. అయినప్పటికీ మొత్తానికి లక్ష టన్నులను స్టోర్​ చేయడానికి జాగ సమస్య ఏర్పడింది. ఇతర జిల్లాల గోడౌన్లకు పంపించిన ఆ తర్వాత అక్కడి మిల్లులకే కేటాయిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.