- రాష్ట్రంలో ఒకవైపు రాజకీయ వేడి.. మరోవైపు వెకేషన్‌కు నేతల క్యూ |
- కాంగ్రెస్ నుంచి రేవంత్, కోమటి రెడ్డి, మధుయాష్కీ, మరికొందరు
- ఆర్ఎస్ నుంచి జగదీశ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్లు
- విదేశాల్లోనే ఫ్యామిలీతో కేటీఆర్ టూర్
- బీజేపీ నుంచి అర్వింద్, డీకే అరుణ
హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకవైపు రాజకీయ వేడి రాజుకుంటుంటే.. మరోవైపు అన్ని ప్రధాన పార్టీల ముఖ్య నేతలు సమ్మర్ వెకేషన్ పేరుతో అమెరికాలో వాలిపోయారు. అక్కడి తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలలో పాల్గొంటూ రిలాక్స్ అవుతున్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనతో ఇక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం కేసీఆర్ పై పరోక్షంగా మోడీ చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లే ముందు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో పెద్ద దుమారాన్నే రేపాయి. రెడ్లకే పార్టీ పగ్గాలను అప్పగించాలన్న రేవంత్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలూ దుమారం రేపుతున్నాయి. ఇలా రాజకీయ వాతావరణం వేడెక్కుతుంటే.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు యూఎస్ బాటపట్టారు. కొందరు నేతలు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచే మీడియాకు ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు.
ఫండింగ్ కోసమేనా?
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతో పాటు మరి కొందరు కాంగ్రెస్ నేతలు అమెరికాలో ఫ్యామిలీస్‌తో, మిత్రులతో గడుపుతున్నారు. టీఆర్ఎస్ నుంచి మంత్రి కేటీఆర్ ఫ్యామిలీతో లండన్‌లోనే ఉన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా అమెరికాలోనే ఉన్నారు. బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ మంత్రి డీకే అరుణతో పాటు పలువురు నేతలు యూఎస్‌లో కల్చరల్ ప్రోగ్రాంలలో పాల్గొంటున్నారు. అయితే, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తుండడం, ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చనే అంచనాలు ఉండటంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు పార్టీల తరపున ఫండింగ్ కోసమే ఇలా అమెరికా బాట పట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
