తప్పులు చేశాం అంటే సరిపోతదా ?: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

తప్పులు చేశాం అంటే సరిపోతదా ?: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

నిజామాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరిగాయి.. క్షమించమని కేటీఆర్ అంటున్నాడని, క్షమించమనగానే వాళ్ల అవినీతి, అరాచకాలను ప్రజలు మరిచిపోతారా? అని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ ధ్వజమెత్తారు. సోనియా తెలంగాణ ఇస్తే కేసీఆర్​ ప్రజలను దగా చేశారన్నారు.

మంగళవారం నిజామాబాద్​ డీసీసీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం డిజైన్​ మార్చి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే చుక్కనీరు రాలేదని మండిపడ్డారు. కాళేశ్వరానికి అంతా తానే అని కేసీఆర్​ చెప్పుకున్నారని, ఆయన పాలనలో కూలిపోతే ఇప్పుడు నాకేం సంబంధం అని ఎట్లంటడని ప్రశ్నించారు.

మేడిగడ్డ వైఫల్యంలో అప్పటి ఇరిగేషన్​ మినిస్టర్​ హరీశ్​రావు రోల్​ లేదా? అని నిలదీశారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు రెడీగా ఉన్నామన్నారు. 56 ఇంచుల ఛాతీ గల ప్రధాని మోదీ నీట్​ ఎగ్జామ్​ను కూడా సరిగా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నాడని విమర్శించారు. పేపర్  లీక్  వల్ల స్టూడెంట్స్​ సూసైడ్​ చేసుకున్నారని, న్యాయం కోసం విద్యార్థులు ఢిల్లీ రోడ్ల మీదకొస్తే ఆడమగ తేడా లేకుండా పోలీసులతో చితక్కొట్టించారని మండిపడ్డారు.

నీట్​ లీక్​కు బాధ్యుడైన సెంట్రల్​ మినిస్టర్​ ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా చేయడంలేదని, ప్రధాని ఆయన్ను తొలగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్​ పేరుతో పేదల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, తెలంగాణలో వారి కుట్రలను అడ్డుకుంటున్నామన్నారు.

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి, రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అగ్రికల్చర్​ కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, డీసీసీ ప్రెసిడెంట్​ నగేశ్​రెడ్డి, నుడా చైర్మన్​ కేశ వేణు ఉన్నారు. నగర కార్పొరేషన్​లో అభివృద్ధి పనులపై కలెక్టర్​ ఇలాత్రిపాఠి, మేయర్​ ఉమారాణితో కలిసి కలెక్టరేట్లో రివ్యూ చేశారు.