- 227 ఆవాసాలకు రోడ్డు..కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు
- నిధుల మంజూరు కోరుతూ కేంద్రానికి ప్రపోజల్స్పంపాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇంకా రోడ్డు కనెక్టివిటీలేని 227 ఆవాసాలకు పక్కా రహదారులు నిర్మించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన నాలుగో దశలో భాగంగా.. రాష్ట్రంలో మొత్తం 642 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది.
ఈ మేరకు మంగళవారం సచివాలయంలో సీఎస్ కె.రామకృష్ణారావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పీఎంజీఎస్‌వై–4 పనుల మంజూరు, కేంద్రానికి పంపాల్సిన నివేదికలపై అధికారులతో సీఎస్ చర్చించారు.
ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. పీఎంజీఎస్‌వై పథకం కింద ఇప్పటివరకు మూడు దశల్లో రాష్ట్రానికి మంజూరైన రహదారులు, వంతెనల నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు.
అదే స్ఫూర్తితో ఇప్పుడు నాలుగో దశలో రాష్ట్రంలో ఇప్పటికీ పక్కా రోడ్డులేని 227 ఆవాసాలను గుర్తించామని, వాటిని కలుపుతూ 642.23 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. వీటిని వెంటనే కేంద్రానికి పంపి, నిధుల మంజూరుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనల్లో కొన్ని అటవీ ప్రాంతాల గుండా వెళ్తుండటంపై సమావేశంలో చర్చించారు.
మొత్తం పనుల్లో 34 పనులకు సంబంధించి.. దాదాపు 148 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు పొందాల్సి ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ వివరించారు. ఈ మార్గాల్లో నిర్మించాల్సిన బ్రిడ్జిలు, రోడ్లకు సంబంధించి మరో వారం రోజుల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పూర్తి చేస్తామని సీఎస్‌కు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
