- ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన పీఆర్ డిపార్ట్ మెంట్
- 174 రోడ్లను హ్యామ్ పద్ధతిలో నిర్మించేందుకు నిర్ణయం
- మిగిలినవి పీఎంజీఎస్‌వై, సీఆర్ఐఎఫ్ నిధులతో చేపట్టేలా ప్లాన్
హైదరాబాద్, వెలుగు: రోడ్ల కష్టాలతో రాష్ట్రంలోని మారుమూల గిరిజన తండాలు, పల్లెలు అల్లాడుతున్నాయి. ఉన్న రోడ్లేమో అడుగడుగునా గుంతలు పడి, కంకర తేలి ప్రమాదాలకు నిలయంగా మారాయి. చిన్న వర్షానికే దారులు బురదమయం అవుతున్నాయి. వానాకాలంలో వాగులు పొంగి, రోడ్లు తెగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండటం లేదు. అత్యవసర పరిస్థితి ఎదురైతే బయటకు వెళ్లలేని, అంబులెన్స్‌కూడా రాలేని దుస్థితి నెలకొంది.
అంతేకాదు, గర్భిణులు, వృద్ధులను డోలీల్లో మోసుకెళ్తున్న ఘటనలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అధికారులు, పాలకులు మారినా రోడ్డు సౌకర్యం కల్పించలేకపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోడ్ల మరమ్మతులు, కొత్తగా నిర్మించేందుకు నిధుల లేమి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది.
‘హ్యామ్’లో భాగంగా టెండర్లు..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,500 ఆవాసాలకు నేటికీ సరైన రోడ్డు మార్గం లేదు. బడ్జెట్ కేటాయింపులు అరకొరగా ఉండటంతో పంచాయతీరాజ్ శాఖ నేషనల్ హైవేల తరహాలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) పద్ధతిని తెరపైకి తెచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న 174 రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించి, టెండర్లు పిలిచింది.
కేంద్రానికి ప్రతిపాదనలు..
మిగతా 2 వేలకు పైగా ఆవాసాలకు రోడ్లు వేయడానికి కేంద్ర ప్రభుత్వ నిధులే ఆధారం. దీంతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) కింద ఆవాసాలను గుర్తించి, వాటికి రోడ్లు మంజూరు చేయాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపే పనిలో ఆఫీసర్లు ఉన్నారు. సెంట్రల్ రోడ్ అండ్ఇన్ఫ్రాస్ట్రక్చర్ఫండ్(సీఆర్ఐఎఫ్) నిధులను ఉపయోగించుకొని మరికొన్ని రోడ్లను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
