లొంగుబాటలో గణపతి..! ఆ దిశగా చర్చలు జరుపుతున్న తెలంగాణ పోలీసులు

లొంగుబాటలో గణపతి..! ఆ దిశగా చర్చలు జరుపుతున్న తెలంగాణ పోలీసులు
  • గణపతి సరెండర్‌‌‌‌తో ‘ఆపరేషన్ కగార్’ ముగించే యోచనలో కేంద్రం
  • కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షాతో సీఎం రేవంత్ కీలక భేటీ
  • దేవ్​జీ సహా మావోయిస్టుల లొంగుబాటు, పునరావాసంపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ తుది దశకు చేరుకుంటున్నది. మావోయిస్టు పార్టీ సెక్రటరీ దేవ్​జీ ఇప్పటికే లొంగిపోగా, అదే బాటలో మావోయిస్టు ఆగ్రనేత, సీపీఐ(మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్‌‌రావు అలియాస్ గణపతి త్వరలో హైదరాబాద్‌‌లో సరెండర్​ కానున్నట్టు తెలిసింది. ఈ అంశంపై మాట్లాడేందుకే కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షాతో బుధవారం సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయినట్లు విశ్వసనీయ సమాచారం. 

మాస్టర్ మైండ్లు హిడ్మా, నంబాల కేశవరావులాంటి  నేతలు ఇప్పటికే ఎన్​కౌంటర్లలో చనిపోగా, పార్టీ జనరల్ సెక్రటరీ దేవ్​జీ, కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిలాంటి నేతలు లొంగిపోయిన సంగతి తెలిసిందే.  మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేసేందుకు కేంద్రం ప్రకటించిన ‘ఆపరేషన్ కగార్’కు  ఈ నెల 31తో గడువు ముగియనున్నది. సరిగ్గా ‘ఆపరేషన్ కగార్’ తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో ఉద్యమ ప్రస్థానంలో అలసి సొలసిన గణపతి లొంగుబాటు కీలకంగా మారింది.  

50 ఏండ్ల అజ్ఞాత వాసంలో మావోయిస్టు పార్టీకి వెన్నుదన్నుగా ఉండి, వ్యూహాత్మక దాడులతో అటు కేంద్ర బలగాలకు, ఇటు వివిధ రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించిన గణపతిని జన జీవన స్రవంతిలోకి తేవడం ద్వారా ఈ ఆపరేషన్‌‌కు ముగింపు పలకాలని కేంద్రం కూడా భావిస్తున్నది. ముందునుంచీ ఎన్​కౌంటర్లను వ్యతిరేకిస్తూ వారికి లొంగిపోయే  అవకాశం ఇవ్వాలని చెప్తున్న సీఎం రేవంత్‌‌రెడ్డి, ఈ ముగింపు ఘట్టానికి తెలంగాణను కీలకంగా మార్చాలని నిర్ణయించారు. 

ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా మావో యిస్టు కీలక నేతలతో ప్రభుత్వ వర్గాలు జరుపు తున్న చర్చలు ఫలప్రదం కావడం వల్లే పార్టీ జనరల్ సెక్రటరీ దేవ్​జీ, కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తదితర నేతలు లొంగిపోయినట్లు చెప్తున్నారు. ఇదే దారిలో తాజాగా  గణపతి సరెండర్​ కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే అంశాన్ని హోం మంత్రి షాకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి వివరించినట్టు సమాచారం. అలాగే, లొంగిపోయిన మావోయిస్టులతో తాను ఇటీవల జరిపిన చర్చలు, వారి విజ్ఞప్తులు, పునరావాస చర్యలపైనా అమిత్​షాతో రేవంత్​మాట్లాడినట్టు, మెరుగైన పునరావాసానికి ఒప్పించినట్టు తెలుస్తున్నది.  

నేడో రేపో మరో 50 మంది.. 

నేడో, రేపో మరికొంత మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. దాదాపు 50 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. ఇందులో సుమారు 10 మంది వరకు తెలంగాణవారు కాగా, మిగిలిన వారంతా చత్తీస్‌‌గఢ్​, మహారాష్ట్ర, ఒడిశా, ఇతర ప్రాంతాల వారు ఉన్నట్లు చెప్తున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్లే వీరంతా తెలంగాణలో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది.