ఫీజు బకాయిల రిలీజ్‌‌‌‌కు ఓకే ..వెంటనే రూ. 600 కోట్లు విడుదల చేసేందుకు ఒప్పుకున్న సర్కారు

ఫీజు బకాయిల రిలీజ్‌‌‌‌కు ఓకే ..వెంటనే రూ. 600 కోట్లు విడుదల చేసేందుకు ఒప్పుకున్న సర్కారు
  • ప్రైవేట్‌‌‌‌ కాలేజీల మేనేజ్‌‌‌‌మెంట్లతో చర్చలు సఫలం 
  • బంద్ విరమిస్తున్నట్టు ఫతీ ప్రకటన.. నేటి నుంచి యథాతథంగా కాలేజీలు
  • మిగిలిన బకాయిలు ప్రతి నెలా కొంత విడుదల చేస్తం: డిప్యూటీ సీఎం భట్టి
  • ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ రేషనలైజేషన్‌‌‌‌పై కమిటీ వేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలకు వెంటనే రూ. 600 కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్​ బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర సర్కారు ఒప్పుకున్నది. ప్రభుత్వంతో ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌పై ప్రైవేట్​ కాలేజీల మేనేజ్‌‌‌‌మెంట్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ప్రైవేట్​ ప్రొఫెషనల్ కాలేజీల మేనేజ్‌‌‌‌మెంట్లు బంద్‌‌‌‌ను విరమించుకున్నట్టు ప్రకటించాయి.  మంగళవారం నుంచి క్లాసులు యథాతథంగా కొనసాగనున్నాయి. సోమవారం ప్రజాభవన్‌‌‌‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్​ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు.. ప్రైవేటు కాలేజీల మేనేజ్‌‌‌‌మెంట్లతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ (ఫతీ) ప్రతినిధులు మాట్లాడుతూ.. గత నాలుగేండ్లుగా రావాల్సిన ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిలను రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. టోకెన్లు ఇచ్చిన డబ్బులు కూడా ఏండ్ల తరబడి పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. త్వరతగతిన రూ.600 కోట్లను రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది.

స్టూడెంట్ల భవిష్యత్తుకు ప్రాధాన్యం : భట్టి 

విద్యార్థుల భవిష్యత్తుకు  కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ స్కీమ్‌‌‌‌ను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. “పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కారు ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. కొన్నేండ్లుగా బకాయిలు చెల్లించకుండా ఆ భారాన్ని మాకు అప్పగించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టోకెన్లు ఇచ్చిన వాటిలో రూ.600 కోట్లు త్వరితగతిన విడుదల చేస్తాం” అని భట్టి పేర్కొన్నారు. మిగిలిన నిధులు కూడా ప్రతినెలా ఎంతో కొంత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఫీజు బకాయిలపై  రెండు రోజులపాటు ప్రైవేటు కాలేజీల మేనేజ్‌‌‌‌మెంట్లతో  చర్చలు జరిపామని తెలిపారు. సర్కారు ప్రతిపాదనలకు అంగీకరించి బంద్‌‌‌‌ను విరమించిన మేనేజ్‌‌‌‌మెంట్లకు భట్టి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్​ రేషనలైజేషన్‌‌‌‌పై మేనేజ్‌‌‌‌మెంట్లు పలు సూచనలు చేశారని, వారి విజ్ఞప్తి మేరకు అధికారులు, మేనేజ్‌‌‌‌మెంట్ల ప్రతినిధులతో రెండు, మూడు రోజుల్లో కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు.  

ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నం: ఫతీ చైర్మన్​ రమేశ్​ బాబు

మేనేజ్‌‌‌‌మెంట్ల బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం బకాయిల రిలీజ్ చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఫతీ ఛైర్మన్ రమేశ్‌‌‌‌బాబు తెలిపారు. ప్రభుత్వం రూ.600 కోట్లు రీలీజ్ చేస్తామని చెప్పడం శుభసూచకమని, సర్కారు హామీతో బంద్‌‌‌‌ను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ చర్చల్లో సీఎస్ రామకృష్ణారావు, ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఫతీ ప్రతినిధులు రవికుమార్, కృష్ణారావు, సునీల్ కుమార్, పరమేశ్వర్ రెడ్డి, నాగయ్య, ఆల్జాపూర్ శ్రీనివాస్, రాందాస్, సూర్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.