రూ.35 కోట్లతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌‌కు మోడ్రన్ లుక్

రూ.35 కోట్లతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌‌కు మోడ్రన్ లుక్
  •     వర్చువల్‌‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ    రూ.500 కోట్ల రైల్వే బడ్జెట్‌‌ను 
  • మోదీ ప్రభుత్వం రూ.4,900 కోట్లకు పెంచింది: రాంచందర్‌‌‌‌రావు
  •     దేశంలో యూరో రైలుకు దీటుగా అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీని వాడుతున్నామని వెల్లడి

హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సరికొత్త హంగులతో ముస్తాబైంది. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పథకంలో భాగంగా రూ.35.61 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఈ స్టేషన్‌‌‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌‌‌‌గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ భారత్ స్టేషన్లను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ స్టేషన్‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతీయ రైల్వే రంగం విమానయాన రంగాన్ని తలపించేలా రూపురేఖలు మార్చుకుంటోందని చెప్పారు.  తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను బడ్జెట్ కేటాయింపులు నిరూపిస్తున్నాయని  పేర్కొన్నారు.

2014 కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఉండేదని, కానీ మోదీ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.4,900 కోట్లకు పెంచిందని వివరించారు. ఈ భారీ నిధుల వల్లే రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, మహా ప్రాజెక్టులు వేగంగా పనులు జరుపుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, భవిష్యత్తులో 3  బుల్లెట్ రైళ్లు, 3 హైస్పీడ్ రైలు కారిడార్లు రాబోతున్నాయని ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 41 రైల్వే స్టేషన్లను ఎలివేటర్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లులాంటి అత్యాధునిక వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నట్టు రాంచందర్ రావు చెప్పారు. విదేశాల్లోని యూరో రైల్ సిస్టమ్ కంటే అడ్వాన్స్‌‌‌‌డ్ టెక్నాలజీని నేడు భారత్ ఉపయోగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. 

స్టేషన్‌‌‌‌లో అత్యాధునిక సౌకర్యాలు: జీఎం సంజయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌

దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ 75 అమృత్ స్టేషన్లను ప్రారంభించడం ఒక చిరస్మరణీయ సందర్భమని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. వాటిలో  హై-టెక్ సిటీ స్టేషన్ ఒకటిగా నిలవడం గర్వకారణమని అన్నారు. హై-టెక్ సిటీ రైల్వే కొత్త స్టేషన్ భవనంలో మెరుగైన వెయిటింగ్ హాల్స్, సైనేజ్‌‌‌‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, దివ్యాంగులకు సౌకర్యాలతో అత్యాధునికంగా అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, సికింద్రాబాద్ డీఆర్​ఎం డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.