- రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తాయి: ఐఎండీ
- హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి ఎడతెగని వర్షం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా నాలుగైదు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తాజాగా వాయుగుండంగా బలపడిందని వెల్లడించింది. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరప్రాంతాల్లో ఈ వాయుగుండం కేంద్రీకృతమైందని, సోమవారం నాటికి ఆ వాయుగుండం మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారుతుందని వివరించింది. అదే రోజు మధ్యాహ్నం పారాదీప్ వద్ద తీరాన్ని దాటుతుందని పేర్కొంది. మరోవైపు రుతుపవన ద్రోణి ప్రస్తుతం రాజస్థాన్, అల్పపీడన కేంద్రం సిధి, రాంచీల వద్ద కేంద్రీకృతమై ఉన్నది.
ప్రస్తుతం వీటి ప్రభావంతో ఉత్తర భారతంతోపాటు బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ నాలుగైదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు పడాలంటే మాత్రం పశ్చిమ మధ్యబంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు బలపడాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడ్డాయి.
జగిత్యాల జిల్లా జగ్గాసాగర్‌లో 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా పాక్పట్లలో 4.1 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 4, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 4, మహబూబాబాద్ జిల్లా గార్లలో 3.8, నిజామాబాద్ జిల్లా ఎర్గట్లలో 3.6, జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో 3.6, నల్గొండ జిల్లా తిమ్మాపూర్‌లో 3.3, మెదక్ జిల్లా మిన్పూరులో 3.2, మంచిర్యాల జిల్లా పాలచెట్టు 2.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్ సిటీలోనూ పలు చోట్ల మోస్తరు వర్షం పడింది. ఉదయం నుంచే మబ్బు పట్టి ఉన్నా.. సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు దట్టంగా కమ్మేసుకున్నాయి. దీంతో సిటీలో పలు చోట్ల వర్షపాతం నమోదైంది. హయత్‌నగర్‌లో 2.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పెద్దఅంబర్‌పేటలో 1.8 సెంటీమీటర్లు, బండ్లగూడ 1.6, పసుమాములలో 1.6, నాగోల్‌లో 1.4, పీర్జాదిగూడలో 1.4, నాదర్గుల్లో 1.4, బాచుపల్లిలో 1.4, గాజులరామారంలో 1.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. రాబోయే రెండు రోజుల పాటూ ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ తెలిపింది.
