తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల(సెప్టెంబర్ 21, 22, 23) పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ములుగు, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఇక హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని.. సెప్టెంబర్ 21వ తేదీన సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతున్నట్లు చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నదని.. రెండు రోజుల్లో ఇది వాయవ్య దిశగా కదిలి జార్ఖండ్‌ మీదుగా వెళ్లే అవకాశం అందని వెల్లడించారు.