జువెనైల్ కేసుల పరిష్కారంలో తెలంగాణకు 8వ స్థానం..ఇండియా జస్టిస్ రిపోర్ట్ లో వెల్లడి

జువెనైల్ కేసుల పరిష్కారంలో తెలంగాణకు 8వ స్థానం..ఇండియా జస్టిస్ రిపోర్ట్ లో వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా 20  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జువెనైల్ (పిల్లల) కేసుల పరిష్కారంలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 53.7% పరిష్కరమైనట్లు ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) తాజా నివేదిక వెల్లడించింది. 

జువెనైల్ జస్టిస్ (చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్)  చట్టం- 2015 అమల్లోకి వచ్చి దాదాపు పదేండ్లు పూర్తవుతున్నా, ఇప్పటికీ దేశంలో 50 వేలకు పైగా పిల్లలు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. 55% కేసులు జువెనైల్ జస్టిస్ బోర్డుల (జేజేబీ) ముందు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 

దేశంలోని 745 జిల్లాలకు గాను 707 జేజేబీలు మాత్రమే ఉండటం, సిబ్బంది ఖాళీలు, మౌలిక సదుపాయాల కొరత వల్ల కేసులు ఏటా ఫార్వర్డ్ అవుతున్నాయని ఐజేఆర్ నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. 

కాగా, అత్యధిక కేసులు పరిష్కారంలో మిజోరాం ఫస్ట్ ఫేసులో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఉత్తరాఖండ్, గోవా, సిక్కిం, కర్నాటక, హర్యానా, నాగాలాండ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, అస్సాం, కేరళ, తిప్రుర, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి.