ఇందిరమ్మ ఇండ్ల 2 ఫేజ్ గైడ్ లైన్స్ విడుదల

ఇందిరమ్మ ఇండ్ల 2 ఫేజ్ గైడ్ లైన్స్ విడుదల
  • రెండో దశలో రెండున్నర లక్షల ఇండ్లు
  • నియోజకవర్గానికి 2 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
  • పూరి గుడిసెలు ఉన్న పేదలకే టాప్ ప్రయారిటీ

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ రెండో దశలో 2.50 లక్షల ఇండ్లను మంజూరు చేస్తూ హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్ శుక్రవారం జీవో జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధి మినహా రాష్ట్రంలోని వంద నియోజకవర్గాలకు నియోజకవర్గానికి 1,500 సాధారణ ఇండ్ల చొప్పున 1.50 లక్షల ఇండ్లు, అలాగే స్లాబ్ వేసుకునేందుకు నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున 50 వేల ఇండ్లను ప్రభుత్వం కేటాయించింది. అంటే ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్ల చొప్పున రెండు లక్షల ఇండ్లను మంజూరు చేశారు.

వీటికి అదనంగా స్టేట్ రిజర్వ్ కోటా కింద మరో 50 వేల ఇండ్లను కేటాయించడంతో మొత్తం ఇండ్ల సంఖ్య 2.5 లక్షలకు చేరింది. నియోజకవర్గాల కోటాలోని 2,000 ఇండ్లలోనే స్లాబ్ వేసుకునే ఇండ్లు 500 ఉండగా, వారికి ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. రెండో దశలో పూరి గుడిసెలు ఉన్న వారికి టాప్ ప్రియారిటీ ఇస్తామని, సర్వేలో అర్హులైన పేదలుంటే వెంటనే ప్రభుత్వం ఇంటిని మంజూరు చేస్తుందని ఉత్తర్వుల్లో వివరించారు.

అయితే, లబ్ధిదారుల వెరిఫికేషన్ బాధ్యతలను ప్రభుత్వం గెజిటెడ్ అధికారులకు అప్పగించింది. ఈ వెరిఫికేషన్ కు అధికారులను జిల్లా కలెక్టర్లు నియమించాల్సి ఉంటుంది. కలెక్టర్లు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఫైనల్ చేసిన లబ్ధిదారుల లిస్ట్‌‌కు జిల్లా ఇన్‌‌చార్జ్ మంత్రి ఆమోదం తీసుకొని ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని స్పష్టం చేశారు. కాగా, ఇందిరమ్మ ఇండ్ల రెండో దశను వచ్చే నెల 1న ఆసిఫాబాద్ జిల్లా కెరామెరి మండలం కొఠారి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.