హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు (ఎంపీడబ్ల్యూఎస్) పంచాయతీరాజ్ శాఖ జీతాలను రిలీజ్ చేసింది. పెండింగ్‌లో ఉన్న అక్టోబర్ నెల జీతాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో పనిచేస్తున్న 49,456 మంది ఎంపీడబ్ల్యూల వేతనాల కోసం రూ.46.77 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిధులను ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీల టీఎస్-బీ పాస్ ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ‘ఐఎఫ్ఎంఐఎస్’ పోర్టల్‌లో పేర్లు నమోదైన వర్కర్లకు మాత్రమే వేతనాలు చెల్లించాలని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించారు. పోర్టల్‌లో పేరులేని వారికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించొవద్దని స్పష్టం చేశారు.
