భారతి బిల్డర్స్ కు రూ.4.74 కోట్ల ఫైన్

భారతి బిల్డర్స్ కు రూ.4.74 కోట్ల ఫైన్
  • కొనుగోలుదారులకు 60 రోజుల్లో నగదు వాపసు చేయాలి 
  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రెరా అథారిటీ
  • ప్రీ-లాంచ్ స్కీమ్ పేరుతో డబ్బు వసూలు
  • నిబంధనలు ఉల్లంఘించినందున డిఫాల్టర్​గా ప్రకటన 

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్- జిల్లా కొంపల్లిలోని ‘భారతీ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్’ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన భారతి బిల్డర్స్  ప్రైవేట్  లిమిటెడ్  సంస్థకు రూ.4.74 కోట్ల భారీ జరిమానా విధిస్తూ శుక్రవారం తెలంగాణ రెరా అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. బాధితులు చెల్లించిన పూర్తి మొత్తాన్ని తెలంగాణ రియల్ ఎస్టేట్ రూల్స్-2017 ప్రకారం వడ్డీతో కలిపి 60 రోజుల్లో వాపసు చేయాలని ఆదేశించింది.

కొనుగోలుదారులు దాఖలు చేసిన ఫిర్యాదులను విచారించిన అథారిటీ.. బిల్డర్  తీరును తీవ్రంగా తప్పుబట్టింది. సంస్థను ఢీపాల్టర్​గా ప్రకటించింది. ‘‘2021లో ప్రీ-లాంచ్ ఆఫర్ల ద్వారా కొనుగోలుదారుల నుంచి భారీ మొత్తంలో నిధులు వసూలు చేసిన ప్రమోటర్ 24 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చి విఫలమయ్యారు. కనీస చట్టబద్ధమైన అనుమతులుగానీ, రెరా రిజిస్ట్రేషన్ గానీ లేకుండానే నిధులు సేకరించడం, ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టలేదు’’ అని అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రాజెక్టు పూర్తయ్యే సూచనలు కనిపించని నేపథ్యంలో కొనుగోలుదారులు ఆ ప్రాజెక్టులో కొనసాగాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగస్వాములైన మరో శ్రీభారతి అనే సంస్థను సైతం ప్రమోటర్లుగా పరిగణిస్తూ, ఈ సంస్థలన్నీ ఉమ్మడిగా ఆ నగదును చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారంలో చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు భారతి బిల్డర్స్  ప్రైవేట్  లిమిటెడ్​ సంస్థను ‘డిఫాల్టర్  ప్రమోటర్’ గా ప్రకటించడమే కాకుండా రూ.3.55 కోట్ల జరిమానా కూడా విధించింది. గతంలో ఇవే ఉల్లంఘనలకు సంబంధించి విధించిన రూ.1.18 కోట్లకు ఇది అదనమని పేర్కొన్నది.