- తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా గ్లోమల్ సమిట్ ఏర్పాట్లు
- అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశం
ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమిట్ వేదిక వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమిట్ నిర్వాహణపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
6న డ్రై రన్ చేపట్టాలి
ఎక్కడా పనులను పెండింగ్లో పెట్టకుండా ఈ నెల 5 లోపు అన్నీ పూర్తి చేయాలన్నారు. 6న డ్రై రన్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. విభాగాల వారీగా అప్పగించిన బాధ్యతలు, వాటి పురోగతిపై సమీక్షించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే డెలిగేట్స్, మన అతిథులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని పార్కింగ్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, సీపీ సుధీర్ బాబు, వాటర్ బోర్డు ఎండీ కె.అశోక్ రెడ్డి ఉన్నారు.
