
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఆర్టీసీ బస్ డిపోలు, బస్టాండ్ల దగ్గర నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు కార్మికులు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విపక్ష నేతలు, ఇతర ప్రజా సంఘాల నేతలు నిరసనలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ఆర్టీసీ సంఘాల నాయకులను ముందుస్తు అరెస్టు చేశారు పోలీసులు. మరికొన్ని చోట్ల పోలీస్ వాహనాలతో ఎస్కార్టు పెట్టి మరీ బస్సులు నడిపిస్తున్నారు.
అటు జిల్లాల్లోనూ ఉదయాన్ని డిపోల ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. బంద్ ను సంపూర్ణం చేయాలని కోరుతున్నారు. డిపోల దగ్గర నిరసన తెలుపుతున్న పార్టీల నేతలను కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.
నిజామాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతం గా కొనసాగుతోంది. వ్యాపార వాణిజ్య సముదాయాలు పెట్రోల్ బంకులు మూసి వేశారు. తెల్లవారుజాము నుంచే డిపోల ముందు ఆందోళనకు దిగారు కార్మికులు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.. దీంతో కార్మికులను అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు పోలీసులు. బస్టాండ్లు, డిపోల వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.