లక్ష కోట్లతో రైతు కార్పొరేషన్​ కావాలి

లక్ష కోట్లతో రైతు కార్పొరేషన్​ కావాలి

ముషీరాబాద్, వెలుగు: లక్ష కోట్లతో రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి అధ్యక్ష కార్యదర్శులు జి.బాలు యాదవ్, గాలి సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఎక్కువగా బడ్జెట్ కేటాయించి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులను సబ్సిడీ కింద అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమితి ఆధ్వర్యంలో బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రైతుల కోసం ఆరాటం.. పోరాటం’ పేరుతో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. దుక్కి దున్నటం నుంచి పంట అమ్ముకునేదాకా అడుగడుగునా కల్తీ, నకిలీ సమస్యల బారిన పడుతున్న రైతులను కాపాడుకోవాలన్నారు. 

ఏక కాలంలో ఒకేసారి రైతు రుణమాఫీ చేయాలని, కౌలు రైతులకు ఎల్ఈఎస్ లోన్లు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతుబంధుతో పాటు సబ్సిడీ పర్సెంటేజ్ పెంచాలని, గ్రామస్థాయిలో గోడౌన్లు నిర్మించాలని, బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితిని పెంచాలని, ప్రభుత్వమే పంట బీమా కట్టించి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. 
వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, లాభదాయకమైన పంటలు సాగు గురించి రైతులకు అధికారులు వివరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.