తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు: వరుస ఓటములతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి ..జిల్లాల బాటలో కేటీఆర్

తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు: వరుస ఓటములతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి ..జిల్లాల బాటలో కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వరుస ఓటములతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలోనూ ఓడిపోవడంతో పార్టీ క్యాడర్​ తీవ్ర నిరాశలో ఉంది. ఈ క్రమంలో వస్తున్న లోకల్​బాడీ ఎన్నికలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోతే  పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని గుర్తించిన హైకమాండ్ ఎలక్షన్స్​ను సీరియస్​గా తీసుకున్నది. 

కాకపోతే  ఆ పార్టీ ఇప్పటివరకు పార్టీపరంగా కమిటీల జోలికి వెళ్లకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కమిటీలు లేకపోవడంతో ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. వీటన్నింటిని అధిగమించి కార్యకర్తలు, పార్టీ శ్రేణులను సమయాత్తం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జిల్లాల పర్యటనలు చేపట్టారు. 

మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా ఉండాలంటే సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో మనవాళ్లే ఉండాలని ఇటీవల వరంగల్​పర్యటనలో కార్యకర్తలకు సూచనలిచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్​తీరును, ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరించాలని, ప్రధానంగా స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టాలని, తమను గెలిపిస్తే గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామనే భరోసా కల్పించాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.