ఇంటి నుంచే పని: సెక్రటేరియెట్​ షిఫ్టింగ్​తో ఉద్యోగుల వర్క్ ​ఫ్రమ్​ హోం

ఇంటి నుంచే పని: సెక్రటేరియెట్​ షిఫ్టింగ్​తో ఉద్యోగుల వర్క్ ​ఫ్రమ్​ హోం

సెక్రటేరియెట్​ షిఫ్టింగ్​, బీఆర్​కే భవన్​ మరమ్మతులు జరుగుతుండడంతో కొందరు ఉన్నతాధికారులు ఇంటి దగ్గర్నుంచే పని చేయనున్నారు. ఆర్థిక శాఖ, మున్సిపల్​, పంచాయతీరాజ్​, నీటిపారుదల, రెవెన్యూ, ఎక్సైజ్​ తదితర శాఖల ముఖ్య కార్యదర్శుల (ప్రిన్సిపల్​ సెక్రటరీ–పీఎస్​) పనులకు ఆటంకం కలగకుండా సీఎస్​ ఎస్​కే జోషి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకూ సీఎస్​సూచించారు. మరికొద్ది రోజుల్లో బడ్జెట్​ పెట్టబోతున్న నేపథ్యంలో, ప్రతిపాదనలు పంపాల్సిందిగా అన్ని శాఖలకు ఇటీవల ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులిచ్చారు. అయితే, సెక్రటేరియెట్​, బీఆర్​కే భవన్​లో డ్యూటీ చేయలేని కారణంగా వర్క్​ ఫ్రం హోం నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

సీఎస్​ జోషి కూడా కొన్ని రోజలు కుందన్​బాగ్​లోని ఇంటి నుంచే పనిచేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచే సమీక్షలు చేయనున్నారు. కాగా, వరుస సెలవులతో సెక్రటేరియెట్​ షిఫ్టింగ్​ పనుల్లో వేగం కాస్త తగ్గింది. శనివారం జీఏడీలోని పలు ఫైళ్లు, ఫర్నీచర్​ను సర్దిపెట్టారు. ఎక్కువ సామాను ఉండడంతో జీఏడీ, సీఎస్​ పేషీల షిఫ్టింగ్​కు ఇంకొంత సమయం పడుతుందని అంటున్నారు. బీఆర్​కే భవన్​కు రిపేర్లు పూర్తి చేసేందుకు వారం నుంచి పది రోజులు పట్టే అవకాశముంది. ఇప్పుడు పెయింటింగ్​తో పాటు వివిధ శాఖల క్యాబిన్లలో ఫ్యాన్లు, లైట్లు పెడుతున్నారు. భవన్​ ఎంట్రెన్స్​ దగ్గర స్కానర్లు ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. అన్ని మరమ్మతులు పూర్తయిన తర్వాతే టెలిఫోన్​, ఇంటర్నెట్​, సీసీ కెమెరాలు, కమాండ్​ కంట్రోల్​ ​రూమ్​, ఇంటర్​కామ్​, డేటా సెంటర్​, సర్వర్​ రూంలు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి బీఆర్​కే భవన్​లో పూర్తి స్థాయిలో పాలన సాగుతుందని చెబుతున్నారు.

అంబాసిడర్ కార్లను ఎం చేస్తారు?

అంబాసిడర్​ కార్లు.. అప్పట్లో ప్రభుత్వం వాడిన కార్లవి. సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు వాటిని వాడారు. కాలం మారడం, టెక్నాలజీ పెరగడంతో కార్లూ మారిపోయాయి. కొత్తవి వచ్చాయి. వాటిని మూలకు పడేశారు. అవిప్పుడు సెక్రటేరియెట్​ క్యాంటీన్​ సమీపంలో తుప్పు పట్టిపోతున్నాయి. ఆ కార్లను ఉన్నతాధికారులు ఏం చేస్తారన్నదానిపై స్పష్టత రావట్లేదు. 100 కార్ల దాకా ఉన్నట్టు తెలుస్తోంది. చాలా కార్లకు ఫ్యాన్సీ నంబర్లున్నాయి. ఉదాహరణకు 2345, 8888, 6666, 5678, 2727, 3277 నంబర్లున్నాయి వాటికి. కొన్ని కార్ల పై ఏపీ జ్యడీషియల్​ అకాడమీ, ఏపీ హైకోర్టు అని స్టిక్కర్లు ఉన్నాయి. విభజన తర్వాత అవి ఏపీ అధీనంలో ఉండేవని సెక్రటేరియట్​ అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఏపీ అధికారులు బ్లాకులు అప్పగించి ఫర్నీచర్​, సామగ్రి, ఫైళ్లు ఇతర వస్తువులను అమరావతికి తీసుకెళ్లిపోయారు. కార్లను మాత్రం పట్టించుకోలేదు. దీంతో అవి తుప్పుపట్టాయి. కొద్ది రోజుల్లో సెక్రటేరియెట్​ను కూల్చబోతున్న నేపథ్యంలో, ఏపీ అధికారులకు లేఖ రాయాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు.