తెలంగాణకు రూ.19వేల500 కోట్ల పెట్టుబడులు.. స్టీల్, విద్యుత్, విమానయాన రంగాల్లో ఒప్పందాలు

తెలంగాణకు రూ.19వేల500 కోట్ల పెట్టుబడులు.. స్టీల్, విద్యుత్, విమానయాన రంగాల్లో ఒప్పందాలు
  • రూ.12,500 కోట్లతో రష్మి గ్రూప్ స్టీల్ ప్లాంట్ 
  • రూ.6 వేల కోట్లతో స్లోవేకియా సంస్థ పవర్ ప్లాంట్ 
  • రూ.వెయ్యి కోట్లతో సర్గాడ్ సంస్థ ఫ్లైట్ రిపేర్ యూనిట్
  • బ్యూటీ టెక్​ జీసీసీ ఏర్పాటు చేస్తామన్న లోరియల్​

హైదరాబాద్, వెలుగు: దావోస్‌‌‌‌‌‌‌‌ సదస్సులో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం బుధవారం వివిధ అంతర్జాతీయ సంస్థలతో జరిపిన చర్చల ఫలితంగా స్టీల్, విద్యుత్, విమానయాన రంగాల్లో దాదాపు రూ.19,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. డక్టయిల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్.. తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 

ఇందుకోసం రూ.12,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. బుధవారం దావోస్‌‌లో సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందంతో రష్మి గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్ పట్వారీ, డైరెక్టర్ సంజిబ్ కుమార్ పట్వారీ భేటీ అయ్యారు. గ్రీన్ మ్యాన్‌‌ఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాల్లోనూ భాగస్వామ్యంపై చర్చలు జరిగాయి. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయాలు, బొగ్గు సరఫరా లింకేజీలు అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్‌‌‌‌ బాబు హామీ ఇచ్చారు. 

రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్లాంట్.. 

క్లీన్ ఎనర్జీ రంగంలో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు స్లోవేకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్‌‌ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఎక్స్‌‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) సమర్పించింది. ఈ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్​రెడ్డితో సమావేశమయ్యారు. ఇందులో ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ చైర్మన్ జాన్ బాబిక్, గ్రూప్ సీఈవో, డైరెక్టర్ అనిల్ కుమార్ బావిసెట్టి, గ్రీన్‌‌హౌస్ ఎన్విరో సీఈవో, డైరెక్టర్ మొలుగు శ్రీపాల్ రెడ్డి,  స్లోవాక్ రిపబ్లిక్ కాన్సుల్ మాటుస్ జెమెస్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ  ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 2047 నాటికి నెట్ జీరో లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. స్లోవేకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్‌‌కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. ఈ కంపెనీ 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్‌‌ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. 

ఫ్లైట్ల రిపేర్ యూనిట్.. 

విమానయాన రంగంలో పేరొందిన సర్గాడ్ సంస్థ (అమెరికా) రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది. రాబోయే 3 నుంచి 5 ఏండ్లలో దశల వారీగా రూ.వెయ్యి కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. దావోస్‌‌లో సీఎం రేవంత్ రెడ్డితో సర్గాడ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీనివాస్ తోట భేటీ అయ్యారు. తెలంగాణలో విమానాల నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని సంస్థ ప్రతినిధులు వ్యక్తం చేశారు. 

సర్గాడ్ సంస్థకు ఏరోస్పేస్, రక్షణ, ఆటోమొబైల్, అడ్వాన్స్‌‌డ్‌‌ మ్యాన్‌‌ఫ్యాక్చరింగ్ రంగాల్లో అనుభవం ఉంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్, ఆదిలాబాద్‌‌లో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటిల్లో ఏదో ఒక చోట ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.