రూరల్ లో 3 లక్షల ఇండ్లు మంజూరు చేయండి : మంత్రి పొంగులేటి

రూరల్ లో 3 లక్షల ఇండ్లు మంజూరు చేయండి : మంత్రి పొంగులేటి
  •      కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​కు హౌసింగ్ మంత్రి పొంగులేటి వినతి
  •      గత 12 ఏండ్ల నుంచి తెలంగాణకు ఒక్క ఇల్లు ఇవ్వలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పీఎం ఆవాస్ యోజన స్కీమ్ లో భాగంగా తెలంగాణ రూరల్ కోటా కింద ఈ  ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి  3 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని మంత్రి పొంగులేటి కలిసి.. ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం తరఫున వినతిపత్రం అందజేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూరల్ కోటా కింద కేంద్రం ఒక్క ఇల్లు మంజూరు చేయలేదని కేంద్ర మంత్రికి పొంగులేటి గుర్తుచేశారు. 

సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు గ్రామీణ  ప్రాంతాలకు ఇండ్లు మంజురు చేయాలని గడిచిన రెండేండ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నామని.. కానీ, కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదన్నారు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని పొంగులేటి కోరారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వ‌‌‌‌చ్చిన తమ ప్రభుత్వం పేద‌‌‌‌ల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. వ‌‌‌‌చ్చే మూడేండ్లలో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించాల‌‌‌‌ని ల‌‌‌‌క్ష్యంగా పెట్టుకుందన్నారు. 

ఇప్పటికే ఈ ఏడాది దాదాపు 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజురు చేశామని,  కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తే ఈ కార్యక్రమం మరింత వేగవంతం అవుతుందని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో గత 12 ఏండ్లలో ఏర్పడిన పెండింగ్ డిమాండ్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రంలోని పరిస్థితులను అర్థం చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో 3 లక్షలు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇండ్లను మజూరు చేయాలని మంత్రి పొంగులేటి  కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​కి విజ్ఞప్తి చేశారు.