జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు... ఏప్రిల్ లో కమర్షియల్ ట్యాక్స్ రాబడి రూ.7వేల 570 కోట్లు.. ఒక్క జీఎస్టీ నుంచే రూ.4వేల 621 కోట్లు..

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు... ఏప్రిల్ లో కమర్షియల్ ట్యాక్స్ రాబడి రూ.7వేల 570 కోట్లు.. ఒక్క జీఎస్టీ నుంచే రూ.4వేల 621 కోట్లు..
  • గతేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 35 శాతం అదనం 
  • దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు

హైదరాబాద్​, వెలుగు : కమర్షియల్​ టాక్స్ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం వచ్చి చేరుతోంది. నిరుటితో పోలిస్తే ఈసారి ఏప్రిల్ లో వాణిజ్య పన్నుల శాఖ రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. జీఎస్టీతోపాటు పెట్రోల్, లిక్కర్‌‌‌‌పై వచ్చే వ్యాట్, వృత్తి పన్ను  కలిపి రూ.7,570 కోట్లు సమకూరాయి. గతేడాది ఏప్రిల్​ కన్నా ఇది 22శాతం అదనం. ఇందులో జీఎస్టీ ఆదాయమే  రూ.4,621 కోట్లు ఉండడం విశేషం. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం. 

గత ఏడాది ఏప్రిల్‌‌లో ఇది రూ.3,433 కోట్లుగా ఉంది. అంటే ఏడాది కాలంలోనే దాదాపు రూ.1,188 కోట్లు అదనంగా వచ్చినట్లయింది. ఇది సుమారు 35 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఇక గడిచిన మార్చి నెలలో వచ్చిన రూ.4,231 కోట్ల రికార్డును ప్రస్తుత వసూళ్లు దాటేశాయి. వరుసగా  4 నెలల నుంచి జీఎస్టీ ఆదాయం రూ.4 వేల కోట్లకు పైగా వస్తోంది. కాగా, పన్నుల వృద్ధి రేటులో  కర్నాటక తర్వాత అత్యధిక వృద్ధి సాధించిన రెండో రాష్ట్రంగా నిలిచింది. 

ప్రజల వినియోగం, కొనుగోలు శక్తి పెరగడం, పారిశ్రామిక, సేవా రంగాల్లో వచ్చిన పురోగతి  వల్లే ఆదాయం కూడా అంచనాలను మించిందని కమర్షియల్​ ట్యాక్స్​ కమిషనర్​ రఘునందన్‌‌రావు తెలిపారు. పన్నుల ఎగవేతను అరికట్టడం కూడా మరో కారణమని ఆయన వెల్లడించారు. రాష్ట్రం నుంచి వసూలైన జీఎస్టీలో  కేంద్ర జీఎస్టీ రూ.2,092 కోట్లు ఉండగా, రాష్ట్ర జీఎస్టీ వాటా రూ.2,527 కోట్లు ఉంటుంది. ఐజీఎస్టీ రూపంలో మరో రూ.2,562 కోట్లు వసూలయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార అనుకూల విధానాల వల్ల కొత్త పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరిగినట్లు ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు.  

దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు సరికొత్త చరిత్ర 

2026 ఏప్రిల్ నెలలో స్థూల జీఎస్టీ రాబడి రూ. 2,42,702 కోట్లకు చేరి రికార్డు సృష్టించింది. గతేడాది ఇదే నెలలో నమోదైన రూ. 2.23 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఇందులో దేశీయ లావాదేవీల ద్వారా రూ. 1,85,122 కోట్లు సమకూరగా, దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 25.8 శాతం వృద్ధితో రూ. 57,580 కోట్లకు చేరింది. ఇక రిఫండ్‌‌ల ప్రక్రియ తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు రూ. 2,10,909 కోట్లుగా నమోదయ్యాయి, ఇది గతేడాది కంటే 7.3 శాతం పెరుగుదల. 

ముఖ్యంగా ఐజీఎస్టీ  రూపంలో రూ. 1,29,232 కోట్లు, ఎస్జీఎస్టీ  ద్వారా రూ. 61,331 కోట్లు, సీజీఎస్టీ  ద్వారా రూ. 52,140 కోట్లు ఖజానాకు వచ్చి చేరాయి. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సానుకూల పవనాలు, పెరిగిన వినియోగం ఈ భారీ వసూళ్లకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.  రాష్ట్రాలవారీగా వసూళ్లను పరిశీలిస్తే మహారాష్ట్ర రికార్డు స్థాయిలో రూ. 22,929 కోట్ల సెటిల్‌‌మెంట్ ఆదాయంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 

యూపీ (రూ. 10,178 కోట్లు), కర్నాటక (రూ. 9,958 కోట్లు), గుజరాత్ (రూ. 9,916 కోట్లు), తమిళనాడు (రూ. 8,413 కోట్లు) వరుస స్థానాల్లో నిలిచి ఖజానాను నింపాయి. వృద్ధి రేటు విషయానికి వస్తే పంజాబ్ 66 శాతం, హర్యానా 58 శాతం, తమిళనాడు 46 శాతంతో దుమ్మురేపాయి.  దేశీయ వసూళ్లలో కర్నాటక (14.5%), తెలంగాణ (12.6%) జాతీయ సగటు కంటే మెరుగైన ఫలితాలు సాధించాయి.