ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం రికార్డు..71.70 లక్షల టన్నుల ధాన్యం కొన్నం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం రికార్డు..71.70 లక్షల టన్నుల ధాన్యం కొన్నం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • వానాకాలం సీజన్ లో రికార్డు సృష్టించినం
  • పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని సివిల్​ సప్లయ్స్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. 2025-26 వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డు స్థాయిలో 71.70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ప్రకటించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల విలువ రూ.18,444  కోట్లకు చేరిందని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 14.20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరినట్లయిందని తెలిపారు. 

పౌర సరఫరాల కమిషనర్  స్టీఫెన్  రవీంద్ర ఆధ్వర్యంలో అధికారులు రూపొందించిన సివిల్​ సప్లయ్స్​ లీగల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ మార్గదర్శకాల పుస్తకాన్ని గురువారం ఐఏఎస్​ ఆఫీసర్స్​ క్లబ్​ లో మంత్రి విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడి సాధించిన నేపథ్యంలో ఎక్స్​పోర్ట్​ చేసేందుకు అనువైన వరి రకాల ఉత్పత్తిని ప్రోత్సహించే విధానాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. 

దేశీయ అవసరాలు తీరిన తర్వాత మిగులు బియ్యాన్ని బల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎగుమతి డిమాండ్ ఉన్న వరి రకాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. రాష్ట్రం ఏటా ధాన్యం కొనుగోళ్లు చేసి రూ.38 వేల కోట్లు రైతులకు నేరుగా  చెల్లిస్తోందని గుర్తు చేశారు. రేషన్​ పంపిణీలోనూ గణనీయమైన సంస్కరణలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. 

ధాన్యం నిల్వ చేసేందుకు స్టెయిన్​లెస్​ స్టీల్​ సైలోలు

పెరుగుతున్న కొనుగోలు అవసరాల నేపథ్యంలో నిల్వ సామర్థ్యాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్  అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర సంస్థల వద్ద 67 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని, అయితే నాణ్యత లోపాల వల్ల ప్రభుత్వానికి నష్టాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వ సహాయం, ప్రైవేటు భాగస్వామ్యంతో స్టెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్  స్టీల్  సైలోలు, ఆధునిక నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇవి తేమ నియంత్రణ, నష్టాల తగ్గింపు, సాంకేతికతకు దోహదపడతాయని వివరించారు. అలాగే రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసే రైస్​ మిల్లులకు ప్రోత్సాహకాలు అందించేందుకు కొత్త మిల్లింగ్​ పాలసీని  రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు.

 రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ ఉన్న ధాన్యాన్ని 17 శాతంలోపు వచ్చేలా ప్యాడీ డ్రయర్లు, ప్యాడీ క్లీనర్లు అమర్చేందుకు ప్రణాళికలు రచించామని మంత్రి చెప్పారు. ఇది రైతు నుంచి లబ్ధిదారుడి వరకు కొనుగోలు సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు.

21.74 కోట్ల బియ్యం అక్రమాలను అరికట్టాం: స్టీఫెన్​ రవీంద్ర

రేషన్​ బియ్యంలో రూ.21.74 కోట్ల అక్రమాలు, స్కామ్​లను అరికట్టామని, రూ.68 కోట్లు మిల్లర్ల నుంచి రికవరీ చేశామని సివిల్​ సప్లయ్స్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర వెల్లడించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో రికార్డు విజయాలను పవర్ పాయింట్​ ప్రజంటేషన్​ ద్వారా ఆయన వివరించారు. నిరుటి వానాకాలం కన్నా 18లక్షల టన్నుల ధాన్యం అదనంగా కొనుగోళ్లు చేశామని తెలిపారు.

రేషన్​ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు 

రేషన్  బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందించేందుకు యోచిస్తున్నామని ఉత్తమ్​ తెలిపారు. గతంలో కాంగ్రెస్  పార్టీ ప్రభుత్వాలు అందించిన తరహాలో ఇతర నిత్యావసర సరుకులను  రేషన్​లో అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.