వెలుగు ఓపెన్ పేజీ : తెలంగాణ బడ్జెట్లో విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి

వెలుగు ఓపెన్ పేజీ : తెలంగాణ బడ్జెట్లో విద్యా రంగానికి  20 శాతం నిధులు కేటాయించాలి

తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మార్చి 20న  ప్రవేశపెట్టే  రాష్ట్ర బడ్జెట్లో  విద్యారంగానికి 20 శాతం  నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని..  బాలల  హక్కుల సంక్షేమ సంఘం  రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విద్యారంగంలో నిధుల కొరత కారణంగానే  పాఠశాలల  నిర్వహణ  సక్రమంగా జరగడం లేదు.  సమస్యలన్నింటికీ  నిధుల కొరతే ప్రధాన కారణం అని అనేక సర్వేల్లో తేలింది.  ఇటీవల  నిర్వహించిన గ్లోబల్ సమిట్​లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తెలంగాణ రైజింగ్ నంబర్ వన్​ అన్నారు.  కానీ,  విద్యారంగానికి కేటాయించే నిధుల (బడ్జెట్)  విషయంలో  తెలంగాణ రాష్ట్రం  దేశంలోనే  అట్టడుగు స్థాయిలో ఉందనే విషయం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో విద్యకు కేటాయిస్తున్న  కేటాయింపులు  చూస్తే  తెలుస్తున్నది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 13 శాతం,  రాజస్తాన్ 18 శాతం,  మధ్యప్రదేశ్ 16 శాతం,  బిహార్ 18.4 శాతం  విద్యారంగానికి తమ తమ రాష్ట్రాల బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నవి. తెలంగాణ రాష్ట్రం మాత్రం 7.57 శాతం  నిధులే  కేటాయించింది.  దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత తక్కువగా  నిధులు కేటాయించడం లేదు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి చూసినా తమిళనాడు 13.4  శాతం, కేరళ 14.8 శాతం,  కర్నాటక 12.9 శాతం,  చివరికి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో కూడా 12 శాతం పైగా  విద్యారంగానికి  నిధులు కేటాయించడం జరుగుతోంది.  

ప్రభుత్వ విద్యాసంస్థల్లో...నాణ్యమైన విద్యను అందించాలి

తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-–15  బడ్జెట్లో  విద్యకు  కేటాయింపులు 10.89 శాతం ఉండగా  బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చివరి సంవత్సరం(2023-– 24) నాటికి అది 6.5 శాతానికి పడిపోయింది.   విద్యారంగాన్ని  గాడిలో  పెడతామని  ఎన్నికల  మేనిఫెస్టోలో విద్యకు బడ్జెట్లో 15శాతం  నిధులు  కేటాయిస్తామని  వాగ్దానం చేసిన  రేవంత్ రెడ్డి  తాము అధికారం  చేపట్టిన మొదటి సంవత్సరం 2024–-25లో 7.3 శాతం,  రెండో  సంవత్సరం 2025-–26లో  7.57 శాతం  మాత్రమే  కేటాయించడం  జరిగింది.  ఈసారైనా  మార్చి 20న  ప్రవేశపెట్టే బడ్జెట్లో  విద్యారంగానికి  కనీసం 20 శాతానికి తగ్గకుండా నిధులు కేటాయించాలని కోరుతున్నాం.   బడ్జెట్ లోటుతో  రాష్ట్ర విద్యారంగం 12 ఏళ్లుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.  వచ్చే విద్యా సంవత్సరంలోపు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో  మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించుటకు చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం  డిమాండ్  చేస్తున్నది. 

కుప్పకూలిన మానిటరింగ్ వ్యవస్థ

విద్యార్థులకు  అవసరమైనన్ని గదులు లేని పాఠశాలలు 13,574 ఉండగా,    ఒక్కటే టాయిలెట్ ఉన్న పాఠశాలలు 21,507 ఉన్నాయి.  పక్కా కాంపౌండ్ వాల్  లేనివి 13,868 ఉండగా కంప్యూటర్ ల్యాబ్​లు  లేనివి 22,047 పాఠశాలలు  ఉన్నాయి.  దాదాపు  20 వేల స్కూళ్లలో  సగటున ఇద్దరే  ఉపాధ్యాయులన్నారు.  విద్యాహక్కు చట్టం ప్రకారం  తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.   వేలాది  పాఠశాలల్లో  సైన్స్,  లెక్కల టీచర్లు లేరు.  భాషా పండితులు లేరు.   మౌలిక వసతులలేమి  కారణంగా  గత  రెండు సంవత్సరాలలో 4000  వరకు స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా బహిరంగంగా పాఠశాలలు రేషనలైజేషన్ చేసి మూసివేస్తామని ప్రకటించలేదు.   రాష్ట్రంలోని 33 జిల్లాల్లో  26 జిల్లాలకు  పూర్తిస్థాయి జిల్లా విద్యాశాఖ అధికారులు(డిఇఓ) లేరు.  ఇంచార్జీ  డీఇఓలు,  ఇంచార్జీ ఎంఇఓలతో రాష్ట్రంలో మానిటరింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. విద్యారంగానికి సంబంధం లేని అధికారుల (కలెక్టర్లకు)కు డిఇఓలుగా అదనపు(ఎఫ్ఏసి) బాధ్యతలు అప్పగించడం జరుగుతోంది. ఇది హేతువిరుద్ధమైనది.  డిప్యూటీ ఇఓ అయినా, డిఇఓ అయినా వారు తప్పనిసరిగా  బీఈడి చేసి ఉండాలి.  స్కూల్ ఎడ్యుకేషన్ తో  సంబంధం లేని అధికారులకు డిఇఓ బాధ్యతలు అప్పగించకుండా చూడాలి. 

పీఈటీ పోస్టులు మంజూరు చేయాలి

అనేక ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లు,  వాచ్​మెన్లు లేరు.  చాలా పాఠశాలల్లో టీవీలు, తదితర విలువైన ఎలక్ట్రానిక్ వస్తు సామగ్రి ఉన్నాయి. వాటికి సరైన రక్షణ లేదు.  అనేక పాఠశాలల్లో గంట కొట్టడానికి సహాయకుడు కూడా లేడు.  ఒక పాఠశాల నడవాలంటే ఏమేమి ఉండాలో అవన్నీ కల్పిస్తేనే పాఠశాల సక్రమంగా నడుస్తుంది.  
అప్పుడే తల్లిదండ్రులకు పాఠశాలపై  నమ్మకం  ఏర్పడుతుంది.  ఇది మా బడి,  మా పిల్లల బడి అని గర్వంగా  చెప్పుకునేలా  ప్రతి బడిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.   సీఎం  రేవంత్​రెడ్డి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేస్తామని క్రీడాపాలసీని రూపొందించారు.  కానీ  ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో క్రీడా సామర్థ్యాలు పెంపొందించుటకు తగు శిక్షణ ఇచ్చే క్రీడా ఉపాధ్యాయులు లేరు.  కావున  ప్రాథమిక స్థాయి పాఠశాలలకు కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్  పోస్టులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.  మనకంటే రెండు  సంవత్సరాల తర్వాత స్వాతంత్ర్యం పొందిన  చైనా  క్రీడారంగంలో ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ఉందన్న విషయం గమనించాలి.  అక్కడి ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే  క్రీడారంగానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్లనే ఇది సాధ్యమైంది.  కనుక ముఖ్యమంత్రి రేవంత్​ ప్రతి ప్రాథమిక  పాఠశాలకు కూడా పీఈటీను నియమించేలా చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరుతున్నది. 

పూర్వ ప్రాథమిక విద్య  ఆవశ్యకతను గుర్తించాలి

పూర్వ ప్రాథమిక విద్య  ఆవశ్యకతను గుర్తించి, అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి.   ప్రభుత్వ యాజమాన్యంలో పూర్వ ప్రాథమిక విద్య  లేని  కారణంగానే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రయివేట్ పాఠశాలల్లో  చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సౌకర్యం లేదు.  ప్రభుత్వ యాజమాన్యంలో  ఎన్​రోల్​మెంట్​ తగ్గుదలకు ఇదొక  కారణంగా ఉంది.  తప్పనిసరిగా  ప్రాథమిక విద్యను  బలోపేతం  చేయుటకు  ప్రతి ప్రాథమిక  పాఠశాలలో  ప్రీ ప్రైమరీ తరగతులు  ప్రారంభించాలి,  అందుకు తగిన  ఉపాధ్యాయులను,  సౌకర్యాలను  కూడా కల్పించాల్సిన అవసరం ఉంది.   అదేవిధంగా  ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం, విశ్వాసం కల్పించే విధంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు  బడిఈడు పిల్లలందరూ  బడుల్లో చేరేవిధంగా విద్యా ఉద్యమాన్ని ప్రారంభించాలి.  ముఖ్యమంత్రి,  మంత్రులు ఒక విధాన నిర్ణయం తీసుకుంటే తల్లిదండ్రులు తమ పిల్లలను  ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుటకు ముందుకు వస్తారు. 

మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచాలి

ప్రభుత్వం చేయాల్సింది బడుల్లో మౌలిక వసతులు కల్పించి, పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.  ఖాళీగా ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారుల  పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. బడుల్లో ప్రయోగశాలలు  పనిచేసేలా  చూడాలి.  విద్యార్థులకు  తాగునీరు,  టాయిలెట్స్  సక్రమమైన  నిర్వహణకు  రన్నింగ్ వాటర్  ఉండేలా  చూడాలి.  మధ్యాహ్న  భోజనం(మిడ్డే మీల్)లో  నాణ్యత పెంచాలి.  అందుకు తనిఖీ వ్యవస్థను  ఏర్పాటుచేయాలి.  తెలంగాణ  రాష్ట్ర  ఫుడ్  కమిషన్  చైర్మన్ సభ్యులు తరచుగా పాఠశాలలు, రెసిడెన్షియల్, కస్తూరిబా స్కూల్స్ సందర్శించి మానిటర్  చేసేలా చూడాలి.   విద్యాశాఖను ముఖ్యమంత్రే  స్వయంగా  నిర్వహిస్తున్నందున  ప్రత్యేక దృష్టిపెట్టి తెలంగాణలో విద్యారంగాన్ని దేశంలోనే ఉన్నతమైన స్థానంలో  నిలబెట్టాలి.   తెలంగాణ  రైజింగ్ నంబర్ వన్​గా  నిలిపేందుకు విద్యారంగానికి అధిక ప్రాధాన్యత  కల్పించాలి.  20 శాతం తగ్గకుండా ఈ బడ్జెట్లో  విద్యారంగానికి నిధులు కేటాయించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం (బీహెచ్ఎస్ఎస్) ముఖ్యమంత్రి  రేవంత్​ రెడ్డికి విజ్ఞప్తి  చేస్తోంది.  

- ఇంజమూరి రఘునందన్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 
బాలల హక్కుల 
సంక్షేమ సంఘం

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.