- మహిళా సంఘాల ఆధ్వర్యంలో డైరీ యూనిట్లు ఏర్పాటు చేయాలి
- సీఎంకు టీజీఎల్‌డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచి తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడంతో పాటు పాల కల్తీని పూర్తిగా అరికట్టేందుకు ఒక ప్రత్యేక డైరీ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (టీఎల్‌డీఏ) చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఒక లేఖ రాశారు. ప్రస్తుతం మనం ప్రతిరోజూ దాదాపు 25 లక్షల లీటర్ల పాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి రెండు మండలాలను ఒక క్లస్టర్‌గా విభజించి మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఆధునిక డైరీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు రాష్ట్రీయ గోకుల్ మిషన్, ఏహెచ్‌ఐడీఎఫ్, ఎన్‌డీడీబీ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల సబ్సిడీలు, సహకారాన్ని వినియోగించుకోవాలని సూచించారు. యూనిట్లకు అవసరమైన భూమి కేటాయింపు, బ్యాంకు రుణాల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలవాలని కోరారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేసే పాలను నేరుగా విజయ డైరీ ద్వారా సేకరించడం వల్ల కల్తీకి అడ్డుకట్ట పడటంతో పాటు స్థానికంగా పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.
