V6 News

డిగ్రీ క్రెడిట్లు తగ్గినయ్!.. జనరల్ డిగ్రీకి 126,  పీజీకి 88 క్రెడిట్లు ఖరారు

డిగ్రీ క్రెడిట్లు తగ్గినయ్!.. జనరల్ డిగ్రీకి 126,  పీజీకి 88 క్రెడిట్లు ఖరారు
  • విద్యార్థులపై భారం తగ్గించేందుకే కౌన్సిల్ నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ విద్యార్థులకు క్రెడిట్ల విధానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. కోర్సుల క్రెడిట్ల విధానంలో కీలక మార్పులు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం (2026-–27) నుంచి  కొత్త క్రెడిట్ సిస్టమ్‌ అమలు చేయాలని నిర్ణయించింది. సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని విద్యామండలి (టీజీసీహెచ్ఈ) ఆఫీసులో చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఆధ్వర్యంలో జరిగిన వీసీల సమావేశంలో  అకడమిక్ సంస్కరణలు, కొత్త కోర్సులపై చర్చించారు. ఈ విద్యాసంవత్సరం డిగ్రీ క్రెడిట్లను 142కు పెంచారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో క్రెడిట్లు ఉంటే స్టూడెంట్లకు భారమవుతుందని గుర్తించి క్రెడిట్ల సఖ్యను తగ్గించారు. తాజా నిర్ణయం ప్రకారం.. జనరల్ డిగ్రీ కోర్సులకు 126 క్రెడిట్లు, ఏఈడీపీ కోర్సులకు 137 క్రెడిట్లు ఉండనున్నాయి.

ఇక పీజీ కోర్సులకు సంబంధించి మొత్తం 88 క్రెడిట్లు ఇవ్వాలని వీసీల సమావేశం నిర్ణయించింది. అయితే జనరల్ డిగ్రీ కోర్సుల్లో ఏడాదికి 40 చొప్పున కేటాయించారు. దీంతో పాటు ఒక్కో సెమిస్టర్ కు ఒక్కో క్రెడిట్​ను కమ్యూనిటీ అవుట్ రీచ్ కోసం అలాట్ చేశారు. మారుతున్న కాలానికి తగ్గట్టు, డిగ్రీ పూర్తి కాగానే నౌకరీలు వచ్చేలా ఏఈడీపీలో కొత్తగా 11 కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వీటి సిలబస్ ఎట్లుండాలి? ఎట్లా బోధించాలి? అనే అంశాలపై చర్చించారు. సమావేశంలో కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, ఓయూ వీసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.