చెరువులపై ‘వెలుగు’ స్టోరీకి స్పందించిన రాష్ట్ర సర్కారు

చెరువులపై ‘వెలుగు’ స్టోరీకి స్పందించిన రాష్ట్ర సర్కారు
  • చెరువుల కబ్జాలపై రిపోర్టు ఇవ్వండి
  • ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి సీఎస్‌ ఆదేశం
  • వివరాలు సేకరిస్తున్న ఇరిగేషన్ ఆఫీసర్లు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో చెరువుల కబ్జాలపై ప్రభుత్వం స్పందించింది. ఈ నెల 14న ‘వెలుగు’లో ప్రచురితమైన ‘చెరువుల్ని మింగుతున్నరు’ స్టోరీపై సీఎస్‌ సోమేశ్ కుమార్ రియాక్ట్‌ అయ్యారు. చెరువుల కబ్జాలపై వెంటనే రిపోర్టు ఇవ్వాలని ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ను ఆదేశిస్తూ గురువారం లెటర్ రాశారు. దీంతో మైనర్‌ ఇరిగేషన్‌ సర్కిళ్ల వారీగా చెరువుల పరిస్థితిపై ఆఫీసర్లు వివరాలు సేకరిస్తున్నారు. చెరువుల అధీనంలో ఉండాల్సిన భూమి, ప్రస్తుతం ఎంత ఉంది, ఎంత మేరకు కబ్జా అయ్యింది తదితర వివరాలన్నీ తెప్పిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి వివరాలతో చీఫ్‌ సెక్రటరీకి నివేదిక అందజేసే అవకాశముందని చెప్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చెరువుల భూముల కబ్జాలు యథేచ్ఛగా జరుగుతుండటంపై కొందరు రైతులు గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేశారు. ఇంకొందరు ప్రధాని ఆఫీసుకు ఫిర్యాదులు పంపారు. అధికార టీఆర్‌ఎస్‌ నేతలే కబ్జాల పర్వంలో ముందు వరుసలో ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.