- చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసిన అధికారులకు గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సమాచార కమిషన్ గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో 14,434 అప్పీళ్లు, ఫిర్యాదులను పరిష్కరించి పెండింగ్ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, సమాచార కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్, దేశాల భూపాల్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆర్టీఐ కార్యకలాపాల నివేదికను సమర్పించారు.
మే 2025లో ప్రస్తుత కమిషన్ ఏర్పాటయ్యే నాటికి గతంలోని 17,808 పెండింగ్ కేసులతో కలిపి మొత్తం 25,430 అప్పీళ్లు పరిశీలనకు వచ్చాయి. జూన్ 2025 నుంచి మే 2026 నాటికి 14,434 కేసులను పరిష్కరించగా, ప్రస్తుతం 10,996 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కమిషన్ నెలకు సగటున 1,200 కేసులను పరిష్కరిస్తూ, విచారణల ప్రక్రియలో భాగంగా దాదాపు 30,000 మంది దరఖాస్తుదారులు, సంబంధిత అధికారులతో ముఖాముఖి నిర్వహించింది.
ఆర్టీఐ చట్టం సకాలంలో అమలు కావడమే లక్ష్యంగా, 2014 నుంచి 2021 మధ్యకాలానికి సంబంధించిన 1,100 పాత కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించారు. జిల్లాల పర్యటనల ద్వారా 23 జిల్లాల్లో, అలాగే 20 ప్రభుత్వ శాఖల పరిధిలోని విచారణలు పూర్తయ్యాయి. అత్యధిక దరఖాస్తులు వచ్చే రెవెన్యూ, పురపాలక శాఖల కేసులను కమిషనర్లకు జోన్ల వారీగా కేటాయించారు.
చట్టంపై అవగాహన పెంచేందుకు 20 జిల్లాలు సహా హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులకు 10,000 మంది హాజరయ్యారు. కమిషన్ చరిత్రలోనే మొదటిసారిగా అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆఫీస్ ద్వారా వ్యయ ఆడిట్ పూర్తయింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న 2014-–2023 వార్షిక నివేదికలను ఉభయ సభల ముందు ఉంచడంతో పాటు, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసిన అధికారులకు గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలను అందజేశారు.
