- ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా సర్కారు ముందు పలు డిమాండ్లు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలవాలని, లేదంటే ఈ నెల 26 తర్వాత సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్ బస్ భవన్‌లో ఆర్టీసీ ఈడీ వెంకన్నకు జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డితో పాటు ఇతర నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు. అక్కడి నుంచి కార్మిక శాఖ కార్యాలయాలనికి వెళ్లి సంబంధిత అధికారులకు నోటీసు అందజేశారు. అనంతరం జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్ 22 (1)లోని నిబంధనలకు అనుగుణంగా సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. ఈ నెల 26లోపు ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో ఈ నెల 27 మొదటి షిప్ట్ నుంచి ఏ క్షణమైనా కార్మికులు సమ్మెకు దిగుతారని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కార్మిక చట్టాల ప్రకారం నోటీసు ఇచ్చిన 14 రోజులకు సమ్మెలో పాల్గొనవచ్చని చెప్పారు.
ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా ప్రభుత్వంలో ఆర్టీసీని ఎందుకు విలీనం చేయడం లేదని, కార్మిక సంఘాలకు ఎన్నికలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ‘‘ఇప్పటికే రెండున్నరేండ్లు ఎదురు చూశాం. ఇక ఓపిక నశించింది. ఆర్టీసీ కుటుంబాలకు ఈ ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతోనే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చింది’’ అని అన్నారు. యాజమాన్యంతో తమకు ఎలాంటి యుద్ధం లేదని, ప్రభుత్వంతోనే తమ యుద్ధమని వారు స్పష్టం చేశారు. రెండున్నరేండ్లుగా తాము ఎన్ని పోరాటాలు చేసినా ఈ ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదన్నారు. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, మరి ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఇవీ డిమాండ్లు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. 2021, 2025 జీత భత్యాల సవరణ వెంటనే చేపట్టాలి. కార్మిక సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి.ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొని వాటిని ఆర్టీసీకి ఇవ్వాలి.డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగ భద్రతపై మార్గదర్శకాలను విడుదల చేయాలి. పీఎఫ్, సీసీఎస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
