మూడేండ్లలో 13 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయాలి..కార్యాచరణ సిద్ధం చేయండి : మంత్రి తుమ్మల 

మూడేండ్లలో 13 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయాలి..కార్యాచరణ సిద్ధం చేయండి : మంత్రి తుమ్మల 
  • పంటల మార్పిడిపై నివేదిక అందజేసిన రైతు కమిషన్‌

హైదరాబాద్‌, వెలుగు: వచ్చే మూడేండ్లలో కనీసం 13 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, ఆయిల్‌ సీడ్స్‌ సాగు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పంటల మార్పిడిపై రైతు కమిషన్‌ నివేదికను చైర్మన్‌ కోదండరెడ్డి, సభ్యులు శనివారం సెక్రటేరియట్‌లో మంత్రికి అందజేశారు. వరి, పత్తికి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కమిషన్‌ పలు సూచనలు చేసింది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు సీజన్లలో కలిపి సుమారు 1.30 కోట్ల ఎకరాల్లో వరి సాగవుతోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా పంటల ఎంపిక ఉండాలని చెప్పారు. ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది లక్ష ఎకరాలకు విస్తరించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. విత్తన నియంత్రణలో కేంద్రంతోపాటు రాష్ట్రాలకు అధికారం ఉండాలన్నారు. ఈ నెలాఖరు నాటికి సరిపడా యూరియా స్టాక్‌ను సిద్ధంగా ఉంచాలని చెప్పారు.

అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులను కలిసి సరఫరాలో జాప్యం లేకుండా చూడాలన్నారు. రామగుండం ఫ్యాక్టరీలో తయారవుతున్న యూరియాలో 90 శాతం తెలంగాణకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్వేశ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, డైరెక్టర్‌ గోపి, ఉద్యానవన శాఖ డైరెక్టర్‌ యాస్మీన్‌ బాషా, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌లక్ష్మీబాయి పాల్గొన్నారు.