నేషనల్ బెస్ట్ టీచర్..అవార్డు అందుకున్న భవానీ బొంపెల్లి

నేషనల్ బెస్ట్ టీచర్..అవార్డు అందుకున్న  భవానీ బొంపెల్లి
  • ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారం

న్యూఢిల్లీ, వెలుగు:కామారెడ్డి జిల్లా గాంధారి ఎంపీపీఎస్ గర్ల్స్ స్కూల్ ఉపాధ్యాయురాలు భవానీ బొంపెల్లి ప్రతిష్టాత్మక ‘నేషనల్ టీచర్స్ అవార్డు–2026’ను అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌‌‌‌‌‌‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆరు సంస్థల నుంచి మొత్తం 48 మంది ఉపాధ్యాయులు ఈ అవార్డులు పొందారు.

ఈ అవార్డులు పొందారు. చిన్నారులకు చదువును ఆనందదాయకంగా మార్చడంతో పాటు బాలికల భద్రతపై భవానీ వినూత్న పద్ధతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల వ్యక్తిగత భద్రతకు సంబంధించి ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ అంశాన్ని ఎలాంటి భయం కలగకుండా పాటల ద్వారా చిన్నారులకు వివరిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. గణితం, అచ్చులు, -హల్లులు వంటి పాఠాలను ఇన్నోవేటివ్ పద్ధతుల్లో బోధిస్తూ, ఎడ్యుకేషనల్ వీడియోల ద్వారా పాఠాలు చెబుతున్న ఆమె ‘యూట్యూబ్ పంతులమ్మ’గా ప్రసిద్ధి చెందారు. ఈ వేడుకలో ఏపీకి చెందిన ఉపాధ్యాయుడు రాజేష్ కౌలూరి కూడా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. విజయనగరం జిల్లాలోని ఎంపీపీఎస్ చినమల్లుపేటలో పనిచేస్తున్న ఆయన, ఏఐ చొరవతో విద్యాబోధన చేస్తున్నారు.  

హైదరాబాద్  ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహుకు జాతీయ పురస్కారం

ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపకుల కోసం ప్రకటించిన ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026’లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు పురస్కారాలు అందుకున్నారు. ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహు, అలాగే మంగళగిరికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ అరుణ్ బాబు (పీడియాట్రిక్స్ విభాగం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ జాతీయ అవార్డులను స్వీకరించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు (హెచ్‌‌‌‌‌‌‌‌ఈఐ), పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మొత్తం 21 మంది అధ్యాపకులను కేంద్ర విద్యాశాఖ ఈ అవార్డులకు ఎంపిక చేసింది.