- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెలుగు కథనంపై వివరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ఇంటర్నెట్ కనెక్షన్ల ప్రణాళిక వేగంగా అమలవుతున్నదని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. సోమవారం ‘బడుల్లో నెట్ కష్టాలు’ హెడ్డింగ్‌తో వెలుగులో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఏప్రిల్ నాటికి మొత్తం12,388 బడులకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలోని 63 శాతం బడుల్లో ఇంటర్నెట్ అనేది 2024–25 యూడైస్‌లోనిదేనని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం 12,388 బడుల్లో బీఎస్ఎన్‌ఎల్, టీ–ఫైబర్ సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు జారీ చేసిందని గుర్తుచేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా ఉచిత కనెక్షన్ల ప్రక్రియ ఇప్పటికే 1,465 బడుల్లో పూర్తయ్యిందని, టీ–ఫైబర్ ద్వారా మరో 674 స్కూళ్లకు కనెక్షన్లు ఇచ్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు.
సమగ్ర శిక్ష నిధులతో పెయిడ్ కనెక్షన్ల కింద బీఎస్ఎన్‌ఎల్ ద్వారా 2,044 బడులకు, టీ–ఫైబర్ ద్వారా 2,010 బడులకు కనెక్షన్లు ఇస్తున్నామని వివరించారు. ప్రైమరీ, యూపీఎస్‌లో 19,800 మంది టీచర్లకు ఇప్పటికే ట్యాబ్‌లు, డేటా సిమ్ కార్డులను పంపిణీ చేశామని, వారి నెలవారీ డేటా బిల్లులను కూడా ప్రభుత్వమే భరిస్తున్నదని స్పష్టం చేశారు.
